Last Updated:
ఆంధ్రప్రదేశ్ పదవ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరిశాయి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యార్థులు 600లో 595, 596 మార్కులతో కార్పొరేట్ బడులకు సవాల్ చేశారు
అన్నిట్లో మేమే ఫస్ట్ అనేది ఇప్పటివరకు కార్పొరేట్ పాఠశాలల నినాదం. కానీ ఈసారి అదే మాటను ప్రభుత్వ పాఠశాలలు గర్వంగా చెబుతున్నాయి. తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ప్రభుత్వ బడులు అద్భుత ప్రతిభ కనబర్చాయి. ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లోని కాకినాడ, కోనసీమ జిల్లాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి పోటీ ఇస్తూ సంచలన ఫలితాలు నమోదు చేశాయి. 600లో 595, 596 మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల నుంచే రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం సామంతకుర్రు ZP హై స్కూల్కు చెందిన శిరిగినీడి రిషిత లక్ష్మి నిహారిక 600కి 596 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయం సాధించానని ఆమె తెలిపింది. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఈ స్థాయి మార్కులు సాధించడం పట్ల విద్యా వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది.
కాకినాడ జిల్లాలోనూ ఇదే సక్సెస్ స్టోరీ కొనసాగింది. తుని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న పీ. హర్షిని 600కి 595 మార్కులు సాధించగా, భానుక్రాంతి 594, ఎండి ఆఫ్రిన్ 591 మార్కులు సాధించారు. వీరితో పాటు మరెందరో విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నిర్వహించిన 45 డేస్ స్పెషల్ కోచింగ్ విద్యార్థుల విజయానికి కీలకమైందని పాఠశాల వర్గాలు తెలిపాయి.
అలాగే 120 ఏళ్ల చరిత్ర కలిగిన రాజా ప్రభుత్వ పాఠశాల కూడా తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఈ పాఠశాలలో విద్యార్థి బి. తరుణ్ 564 మార్కులు సాధించగా, మరెందరో 500కి పైగా మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను చెరిపేసేలా ఈ ఫలితాలు నిలిచాయి.
ఈసారి వచ్చిన పదవ తరగతి ఫలితాలు ప్రభుత్వ బడుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. కష్టపడి చదివిన విద్యార్థులు, అంకితభావంతో బోధించిన ఉపాధ్యాయులు కలిసి సాధించిన ఈ విజయాన్ని తల్లిదండ్రులు, ప్రజలు హర్షంతో స్వాగతిస్తున్నారు. ఇకపై మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇంటర్ కూడా ప్రభుత్వ కళాశాలల్లోనే చదివి మరింత ఉన్నత స్థాయికి చేరాలని పలువురు సూచిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం మరింత పెరిగేలా ఈ ఫలితాలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


