Fuel Crisis: డీజిల్ కోసం బంకుల్లో రైతులు దెబ్బలాట.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ కొరతతో బంకుల వద్ద భారీ క్యూ, రైతులు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు, ఘర్షణలు, ప్రజలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షేపం సామాన్య ప్రజలనే కాకుండా, దేశానికి వెన్నెముక అయిన రైతును సైతం కోలుకోలేని దెబ్బ తీస్తోంది. మొన్న గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు, నేడు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే అన్నదాతకు ఈ డీజిల్ కొరత ఒక శాపంగా మారింది.

ప్రస్తుతం ఇంధనం దొరకదేమో అన్న దుష్ప్రచారం లేదా భయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు వాహనదారులు, రైతులు పోటీ పడుతున్నారు. సాధారణంగా అర లీటరు, లీటరు కొట్టించే వారు నేడు ‘ఫుల్ ట్యాంక్’ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. ఈ అదనపు డిమాండ్ వల్ల బంకుల్లో స్టాక్ త్వరగా అయిపోతోంది. అధికారులు మాత్రం “డీజిల్‌కు ఎలాంటి కొరత లేదు” అని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అనేక బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వరి పొలాలు దుక్కు దున్నే సమయం. పొలం పనులు సాగాలంటే ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అనివార్యం. ఒక ఎకరం పొలం దున్నాలంటే సుమారు 10 లీటర్ల డీజిల్ అవసరమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు డబ్బాలు పట్టుకుని బంకుల వద్ద క్యూ కడుతున్నారు. కౌలు రైతులు, చిన్నకారు రైతులు తమ పొలం పనులు ఆగిపోతాయన్న భయంతో తెల్లవారుజాము నుండే లైన్లలో నిలబడుతున్నారు.

డీజిల్ కొరత ఎంతటి దారుణ పరిస్థితులకు దారితీసిందంటే, రైతులు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. సామర్లకోట సమీపంలోని ఒక పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కోసం వేచి ఉన్న రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్టాక్ అయిపోతుందన్న భయంతో వరుస క్రమంలో నిలబడే విషయంలో మాట మాట పెరిగి, అది చివరకు చొక్కాలు చింపుకుని కొట్టుకునే వరకు వెళ్లింది. అన్నం పెట్టే రైతు, తన పొలం పనుల కోసం ఇలా నడిరోడ్డుపై కొట్లాటకు దిగాల్సి రావడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది.

కేవలం రైతులు మాత్రమే కాకుండా, రెక్కాడితే గానీ డొక్కాడని ఆటో కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రతిరోజూ ఆటో నడిపితే వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే వారి కుటుంబాలు గడుస్తాయి. ప్రస్తుతం బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో, వారి పని గంటలన్నీ నిలబడటానికే సరిపోతున్నాయి. రాత్రి ఏడు గంటలు దాటితే చాలా బంకుల్లో బోర్డులు పెట్టేస్తుండటంతో, తదుపరి రోజు ఉపాధి కోసం వారు రాత్రంతా ఆందోళన చెందాల్సి వస్తోంది.

ఏపీలో ఇంధన సంక్షోభం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఒకవైపు ధరల పెరుగుదల, మరోవైపు లభ్యత లేకపోవడంతో రైతులు, కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సరఫరాను మెరుగుపరిచి ఈ కృత్రిమ కొరతను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ఈ ఘర్షణలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *