నిరసన తెలుపుతున్న డీలర్లు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎరువులు, పెస్టిసైడ్స్ మరియు విత్తనాల డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం నిర్వహించిన దేశవ్యాప్త భారత్ బంద్‌కు ఉరవకొండలో విశేష స్పందన లభించింది. బంద్‌కు మద్దతుగా స్థానిక డీలర్లు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా డీలర్లు ఐక్యంగా నిలబడి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.
జిల్లా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం. గంగాధర్ మాట్లాడుతూ, ఎరువులు, విత్తనాల డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిపై స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ డీలర్లు త్రివేణి భీమన్న, మోహన్, మస్తాన్ వలి, నాగమల్లి ఓబులేసు, భద్రి తదితరులు పాల్గొన్నారు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మరియు విత్తన డీలర్ల అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై బంద్ విజయవంతానికి సహకరించారు.


