Vadapalli Temple: కోనసీమ తిరుపతిలో భక్తుల జాతర.. ఎండలను లెక్కచేయక పోటెత్తిన జనం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

కోనసీమ వాడపల్లి లో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భారీ రద్దీ, ఎండల మధ్య భక్తుల క్యూలు, ట్రాఫిక్ జామ్, దేవస్థానం అన్నప్రసాదం, సౌకర్యాల ఏర్పాటు

+

మరో

మరో తిరుపతి వాడపల్లిలో ఏటు చూసినా భక్తులే

కోనసీమ ముఖద్వారంలో, గోదావరి నదీ తీరాన వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం వాడపల్లి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడ చందన రూపిడిగా కొలువై భక్తుల కష్టాలను తీరుస్తున్నారు. ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రం, ముఖ్యంగా శనివారం నాడు భక్తుల కోలాహలంతో జనారణ్యంగా మారుతుంది. ఏడేడు జన్మల పుణ్యఫలం ఉంటేనే వాడపల్లి వేంకటన్న దర్శనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుడు భక్తులను ఏ విధంగా కటాక్షిస్తున్నారో, అదే రీతిలో కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలోని వాడపల్లిలో స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్వామివారు ‘చందన రూపిడి’ గా దర్శనమివ్వడం విశేషం. సహజంగా శివునికి అభిషేకాలు జరుగుతాయి, కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వేంకటేశ్వరునికి చందనంతో అలంకరించడం ఈ క్షేత్ర ప్రత్యేకత.

వాడపల్లిని “ఏడు వారాల వెంకటేశ్వర స్వామి” అని పిలుస్తారు. ఎవరైతే తమ మనసులోని కోరికను స్వామికి చెప్పుకుని, వరుసగా ఏడు శనివారాలు వచ్చి ఏడు ప్రదక్షిణలు చేస్తారో, వారి కోరికలు తప్పక నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ఆనవాయితీ తరతరాలుగా కొనసాగుతోంది.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. భానుడు రికార్డు స్థాయిలో సెగలు కక్కుతున్నప్పటికీ, భక్తుల భక్తి ముందు ఆ వేడి తలవంచక తప్పలేదు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకే స్వామివారికి మంగళహారతి సమర్పించి దర్శనాలను ప్రారంభించారు. తెల్లవారకముందే వేలాది మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. అడుగడుగునా భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులపై ఎండ పడకుండా చలవ పందిళ్లు ఏర్పాటు చేశారు. దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, చల్లని నీరు పంపిణీ చేస్తున్నారు. కోనసీమలోని ఆర్టీసీ బస్సులన్నీ వాడపల్లి వైపే అన్నట్లుగా బస్సులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి.

దీని ప్రభావంతో వాడపల్లి నుంచి రావులపాలెం వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమిస్తున్నారు. శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో, ఆయన ప్రసాదం స్వీకరించడం భక్తులు అంతే పవిత్రంగా భావిస్తారు. సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రసాదం అందడం కష్టమవుతుంది, కానీ వాడపల్లి దేవస్థానం ఒక అద్భుతమైన ఏర్పాటు చేసింది.

గుడి ఆవరణలో వెలుపల సత్రాల్లో అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి ప్రసాదాన్ని రుచి చూసి వెళ్లాలనే పట్టుదలతో అధికారులు, స్వచ్ఛంద సేవకులు కంకణం కట్టుకున్నారు. ఇది భక్తులకు ఎంతో ఊరటనిస్తోంది.

వాడపల్లి క్షేత్రం సంతాన సాఫల్యతకు పెట్టింది పేరు. సంతానం లేని దంపతులు స్వామిని ఏడు వారాలు దర్శించి, ఏడు ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని చెబుతారు. “వైద్యులు సైతం పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిన కేసులు వాడపల్లి స్వామి కృపతో సంతాన భాగ్యాన్ని పొందాయి.”

ఇలా సంతానం పొందిన దంపతులు తిరిగి ఆలయానికి వచ్చి, తమ బిడ్డతో కలిసి స్వామికి ‘సాక్షి’ చెప్పడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారంగా మారింది. మాకు సంతానం కలిగింది స్వామి అని భక్తులు సంతోషంగా సాక్ష్యం చెప్పడం ఇక్కడ నిత్యం కనిపించే దృశ్యం.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *