ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం.. సంజీవని ప్రాజెక్ట్‌తో చికిత్స సులభం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు జిల్లాలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ఆరోగ్య సేవల్లో గేమ్ ఛేంజర్, రోగుల రికార్డులు డిజిటల్, వర్చువల్ కన్సల్టేషన్, టాటా DiNC టోల్ ఫ్రీ 155337 సేవలు ప్రారంభం

రాష్టంలోనే తొలి డిజిటల్ నేర్వే సెంటర్ ఇక్కడ నుండే ప్రారంభించారు అందుకే ఈ ఫలితాలు
రాష్టంలోనే తొలి డిజిటల్ నేర్వే సెంటర్ ఇక్కడ నుండే ప్రారంభించారు అందుకే ఈ ఫలితాలు

ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాలో గేమ్ ఛేంజర్‌గా మారుతోంది. రోగుల వ్యక్తిగత వైద్య వివరాలను పూర్తిగా డిజిటల్ రూపంలో నిర్వహిస్తూ, చికిత్సను మరింత సులభతరం చేసే ఈ వ్యవస్థ మంచి ఫలితాలు ఇస్తోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. కుప్పంలో ప్రారంభమైన ఈ డిజిటల్ సర్వ్ సెంటర్ ఇప్పుడు ఆరోగ్య సేవల్లో కొత్త మార్గాన్ని చూపుతోంది.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా సంజీవని అమలుపై 9 జిల్లాల వైద్య సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్రంలోని తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించారని గుర్తుచేశారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని ప్రస్తుతం మంచి ఫలితాలను అందుకుంటోందని తెలిపారు.

ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులు ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేయబడ్డాయి. దీంతో ప్రతి రోగి ఆరోగ్య చరిత్ర ఒకే చోట అందుబాటులోకి రావడం వల్ల వైద్యులు సకాలంలో నిర్ధారణ చేసి, సరైన చికిత్స అందించగలుగుతున్నారు. అంతేకాదు, వైద్య నిపుణులతో అపాయింట్‌మెంట్లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవలు కూడా ఈ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.

ప్రత్యేకంగా వర్చువల్ విధానంలోనూ వైద్య సేవలు అందించే సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతగా నిలుస్తోంది. దూర ప్రాంతాల్లో ఉన్న రోగులు కూడా నిపుణుల సలహా పొందే అవకాశం కలుగుతోంది. ప్రతి పిహెచ్‌సీలో పీసీసీ, స్టాఫ్ నర్స్, డాక్టర్, ఎల్‌టీ, ఫార్మసిస్ట్ లాగిన్స్ ద్వారా ఓపీ పేషెంట్లకు 100 శాతం డేటా ఎంట్రీ చేయాలని కలెక్టర్ సూచించారు.

సంజీవని ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు కావాలంటే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఖచ్చితమైన డిజిటల్ డేటా ఎంట్రీ భవిష్యత్ చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చడం ద్వారా పునః పరిశీలన, ఫాలోఅప్ చికిత్స మరింత సులభం అవుతుందని వివరించారు. టాటా DiNC టోల్ ఫ్రీ నెంబర్ 155337 ద్వారా సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ నాగ శశిభూషణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, టాటా కన్సల్ట్ ట్రైనర్ తపాన్ దాస్‌తో పాటు అన్నమయ్య, తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి అనంతపురం, నంద్యాల, కర్నూలు, మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే, డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఆరోగ్య రంగంలో పారదర్శకత, వేగం, నాణ్యత ఇలా ఒకే వేదికపైకి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *