Last Updated:
రాజమండ్రి సమీప మునగాల కొండపై పెద్దపులి సంచారం, నాలుగు గ్రామాల్లో భయం, అటవీశాఖ ట్రాంక్విలైజర్ గన్స్, పూణే నిపుణులతో ఆపరేషన్, 24 గంటల పర్యవేక్షణ
ఐదు నెలలుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టించిన పెద్దపులి ఇప్పుడు రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. బుట్టాయిగూడెం నుంచి ప్రారంభమైన దాని సంచారం కోనసీమ వరకు వెళ్లి, మళ్లీ దారి మళ్లించిన ఈ పులి తాజాగా గోదావరి దాటి కోరుకొండ పాండవుల మెట్టపై తలదాచుకోవడం పరిస్థితిని మరింత సీరియస్‌గా మార్చింది.
రాత్రి సమయాల్లో ఆహారం, నీటి కోసం కిందకి దిగుతూ… పగలు అయితే ఎత్తైన కొండలపైకి వెళ్లడం ఈ పులి ప్రత్యేకతగా మారింది. తాజాగా దాహం తీర్చుకోవడానికి కిందికి వచ్చిన పులి, తిరిగి సమీపంలోని మునగాల కొండపై శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నట్లు దాని మెడకు అమర్చిన ట్రాకింగ్ కెమెరా ద్వారా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
ఈ మునగాల కొండ చుట్టూ నాలుగు గ్రామాలు ఉండటం ఆందోళనకు మరింత కారణమైంది. ఇప్పటివరకు అటవీ ప్రాంతాలకే పరిమితమైన పులి, ఇప్పుడు జనావాసాలకు చేరువ కావడంతో ఏ క్షణమైనా గ్రామాల్లోకి చొరబడే ప్రమాదం ఉందన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఇప్పటి వరకు గ్రామాల్లోకి ప్రవేశించకపోయినా… రాత్రి సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన మాత్రం తగ్గడం లేదు.
ఇక పులిని బంధించేందుకు అటవీశాఖ యంత్రాంగం భారీ ఆపరేషన్ ప్రారంభించింది. కొండ దిగితే వెంటనే మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని కూడా రంగంలోకి దించారు. గతంలో ఉపయోగించిన విధానాన్నే అనుసరిస్తూ ట్రాంక్విలైజర్ గన్స్‌తో పులిని అదుపులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళిక రచించారు. అయితే పులి ప్రవర్తన ఎప్పటికప్పుడు మారుతుండటంతో అది కిందకి వస్తుందా… లేక మళ్లీ ప్రాంతం మార్చి మరోచోట కలకలం రేపుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.
మరోవైపు మునగాల కొండ చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా పశువులపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రామం బయట ఒంటరిగా తిరగొద్దని, రాత్రివేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పశువులను రక్షణలో ఉంచుకోవాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
పులి కదలికలను దాని మెడలో ఉన్న కెమెరా ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రత్యేక బృందాలు 24 గంటలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయని అటవీశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం కొండపై పులి కింద గ్రామాల్లో ప్రజలు… ఈ పరిస్థితి ఎటు మళ్లుతుందో అన్న ఉత్కంఠ రాజమండ్రి పరిసర ప్రాంతాలను కమ్మేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


