ముప్పును ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆదేశం
క్లాడ్ మిథోస్ అనే అత్యంత శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ వల్ల భారత బ్యాంకింగ్ రంగానికి పొంచి ఉన్న సైబర్ ముప్పుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వివిధ బ్యాంకుల అధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.ఆంత్రోపిక్ అనే AI స్టార్టప్ అభివృద్ధి చేసిన ఃక్లాడ్ మిథోస్ః సైబర్ భద్రత విషయంలో అత్యంత అధునాతనమైనదిగా పేరుపొందింది. మనుషులు గుర్తించడంలో విఫలమైన వేలాది సైబర్ భద్రతా లోపాలను ఇది కనుగొన్నట్లు సమాచారం. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో 27 ఏళ్లుగా ఉన్న లోపాలను కూడా ఇది బయటపెట్టింది. అందుకే దీన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఒకవేళ ఇది చెడు ఉద్దేశాలున్న వారి చేతికి చిక్కితే, అధునాతన హ్యాకింగ్ సామర్థ్యాలు పొందినట్లేనని ఆంత్రోపిక్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొందరు అనధికారికంగా ఈ AIని యాక్సెస్ చేశారన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి.ఈ ముప్పు అసాధారణమైనదని, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య అత్యంత జాగరూకత, సమన్వయం అవసరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్యాంకులు తమ ఐటీ వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవాలని, వినియోగదారుల డేటాను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. ముప్పును నిజ సమయంలో గుర్తించి, దాని వివరాలను బ్యాంకులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వంటి సంస్థల మధ్య పంచుకోవడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తక్షణమే స్పందించేందుకు వీలుగా ఒక సమన్వయ సంస్థాగత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కు మంత్రి సూచించారు. కేవలం భారత్‌లోనే కాకుండా, అమెరికా ప్రభుత్వం కూడా మిథోస్ ముప్పుపై వాల్‌స్ట్రీట్ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు, ఈ AI వల్ల భారత ఆర్థిక రంగానికి ఎంత మేరకు ప్రమాదం ఉందనే అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తున్నాయి.
The post కొత్త AI మిథోస్ కలకలం.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక appeared first on Visalaandhra.


