హైదరాబాద్: చిత్ర సీమకు ‘శివ’ సినిమాతో పరిచయమై ‘సత్య’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, హోమం వంటి హిట్ సినిమాలు తీసి టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. మళ్లీ ఈ మధ్య మునుపటిలా కీలకమైన పాత్రల్ని పోషిస్తూ సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ‘గాయపడ్డ సింహం’లో కీలక పాత్ర పోషించారు. తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భగా జేడీ చక్రవర్తి హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘పాత్రలు బాగున్నంత మాత్రాన సినిమాలు ఆడవు. కథ ప్రభావం చూపించినప్ప్పుడే సినిమాలోని అన్ని పాత్రలకీ పేరొస్తుంది. అందుకే మొదట కథనే నేను నమ్ముతా’ అని అంటున్నారు జేడీ చక్రవర్తి. ప్రతినాయక పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టి… తర్వాత కథానాయకుడిగా ప్రేక్షకుల్ని అలరించారు. ‘నా కెరీర్‌లో…అవకాశాలు వచ్చాయి కదా అని వేగంగా సినిమాలు చేయలేదు, కథ నచ్చితేనే చేస్తుంటాను. దర్శకుడు కశ్యప్ ఈ కథని చెప్పాక ఎప్పటికప్ప్పుడు గుర్తు చేసుకుని మరీ నవ్వుకున్నా. రియలిస్టిక్ హ్యూమర్ ఉన్న సినిమా. ప్రతి పాత్ర సీరియస్‌గానే కనిపిస్తుంది. కానీ వాటిని చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం నవ్వొస్తుంది. ఇందులో నేను పోషించిన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. పాత్ర నిర్మాణం ఓ సవాల్‌తో కూడుకున్నట్టు అనిపిస్తే నటుడికి అదొక ప్రత్యేకమైన అవకాశమే అన్నారు.
కమల్‌హసన్‌కు రాని అవకాశం నాకు వచ్చింది…
కమల్‌హాసన్‌కు కూడా రాని అవకాశం ఈ సినిమాతో నాకు వచ్చిందని భావిస్తాను. ఆయన చేసిన పాత్రలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. కానీ ఆయనకి కూడా ఎప్ప్పుడూ ఇలాంటి పాత్రని చేసే అవకాశం ఇప్పటిదాకా రాలేదేమో! ఇందులో నేను బ్రూటల్ ధర్మ అనే పాత్రలో కనిపిస్తా’ అని చెప్ప్పుకొచ్చారు. రాబోయే ‘గాయపడ్డ సింహం’ చిత్రం గురించి మాట్లాడుతూ…‘ప్రచార చిత్రాల్లో నేను, తరుణ్ భాస్కర్ మాత్రమే కనిపిస్తున్నాం. ఇందులో మరో సింహం కూడా ఉంది. అదెవరన్నది త్వరలోనే బయటికొస్తుంది. తరుణ్ పోషించిన దరహాస్ అనే పాత్రతో, మరో రెండు పాత్రలు అనుకోకుండా కలుస్తాయి. ఆ మూడు పాత్రలు దేనికవే ఎలా గాయపడ్డాయి? ఆ ముగ్గురి జీవితాల్లో ఎదురైన పరిస్థితులు ఎలాంటివన్నది ఇందులో కీలకాంశం. దర్శకుడు కశ్యప్‌కి ఇది తొలి సినిమానే అయినా, ఆయనకి చాలా అనుభవం ఉంది. నేను, తరుణ్, పవన్ సాధినేని… ఇలా సెట్‌లో చాలా మందే దర్శకులం ఉన్నప్పటికీ, కశ్యప్ తాను ఏదైతే చెప్పాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు’ అన్నారు. తన గురించి చెపుతూ…‘హీరో, విలన్ అంటూ లెక్కలేసుకోను. నాకు నటనంటే ఇష్టం. కథ కొత్తగా అనిపిస్తే పాత్రతో సంబంధం లేకుండా నటిస్తా. ప్రయోగాలకు ఎప్ప్పుడూ వెనకడుగు వేయను. నటుడిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం పూర్తిగా నేనే! నాకు అనిపించింది సూటిగా చెప్పేస్తాను. నన్ను అహంభావి అనుకున్నా ఫర్వాలేదు కానీ, ఎదుటివాళ్లని మెప్పించాలని మాటలకు చక్కెర పూత పూయను. నాపై రామ్‌గోపాల్ వర్మ ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అని జేడీ చక్రవర్తి చెప్ప్పుకొచ్చారు.


