Last Updated:
అనంతపురం పెద్దవడుగూరులో గోశాల గడ్డివాముల దహనం కేసులో అరెస్టైన సుధాకర్‌పై ఎస్సై ఆంజనేయులు దాడి వీడియో వైరల్, రైతులు ఎస్సైకి బలమైన మద్దతు, ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆసక్తి
అనంతపురం జిల్లాలోని Peddavaduguruలో జరిగిన గడ్డివాముల దహనం ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్లో నిందితుడిని ఎస్సై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చట్ట పరంగా సరైందా? అనే ప్రశ్నలు ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు నిందితుడు చేసిన పని తెలిసి ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది.
ఆదివారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మహాలక్ష్మి గోశాలకు చెందిన సుమారు రూ.2.50 లక్షల విలువైన పశుగ్రాసాన్ని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎస్సై ఆంజనేయులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయం తీసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా డ్రోన్ ఫుటేజీ పరిశీలిస్తుండగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో పెద్దవడుగూరు గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా రైతుల పశువులకు అత్యంత అవసరమైన గడ్డివాములను వరుసగా దగ్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు అరెస్ట్ అయ్యాడనే విషయం తెలిసిన వెంటనే వందలాది మంది రైతులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని మాకు అప్పగించాలి అంటూ డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై ఆంజనేయులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితుడిని ప్రజల చేతికి అప్పగించకుండా అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నిందితుడిపై ఎస్సై దాడి చేసిన వీడియో బయటకు రావడంతో అది వైరల్‌గా మారింది. కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని విమర్శిస్తుంటే, మరికొందరు రైతుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని ఎస్సై తీసుకున్న చర్యలను సమర్థిస్తున్నారు. రైతులు కూడా ఎస్సై గతంలో ఎన్నో కేసులను చాకచక్యంగా పరిష్కరించారని, ఆయనపై చర్యలు తీసుకునే ముందు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో విచారణ జరపాలని కోరుతున్నారు.
ఈ ఘటనతో పెద్దవడుగూరులో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఎస్సైకు మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతు లభించడం ఆయన విధినిర్వహణపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ అంశంపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh
Apr 22, 2026 10:21 PM IST


