Last Updated:
కామాక్షి దేవీ సమేత కాలభైరవ స్వామి ఆలయం, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి మధ్య, 300 ఏళ్ల చరిత్రతో, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు, భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది.
చాలా ఆలయాల్లో కాలభైరవ స్వామి మనిషి రూపంలో దర్శనమిస్తారు. కానీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి గ్రామాల మధ్య వెలసిన కామాక్షి దేవీ సమేత కాలభైరవ స్వామి ఆలయం మాత్రం భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని కలిగిస్తోంది. ఇక్కడ కాలభైరవ స్వామి లింగరూపంలో స్వయంభూ మూర్తిగా కొలువై ఉన్నారని స్థానికులు, పెద్దలు విశ్వసిస్తారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం కాలభైరవారాధనకు అరుదైన కేంద్రంగా పేరుపొందింది.
ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ ఆలయానికి అత్యంత వైభవాన్ని తీసుకొస్తాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శివనామస్మరణ, ప్రత్యేక పూజలు, హోమాలు, రథోత్సవాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడుతుంది.
ఈ క్షేత్రానికి మరో విశేష నమ్మకం కూడా ఉంది. ఏళ్లుగా సాగుతున్న భూ వివాదాలు, కోర్టు కేసులు, ఆస్తి సమస్యలతో బాధపడుతున్న వారు అమావాస్య తర్వాత వచ్చే అష్టమి రోజున ఆలయానికి వచ్చి బూడిద గుమ్మడికాయతో దీపం వెలిగిస్తే ఉపశమనం కలుగుతుందని భక్తులు చెబుతారు. ఇలా వరుసగా ఐదు అష్టముల పాటు దీపారాధన చేస్తే సమస్యలు తొలగుతాయని ఆలయ అర్చకులు భాస్కర్ స్వామి తెలిపారు. ఈ విశ్వాసంతో ప్రతి నెలా అనేక మంది ప్రత్యేకంగా వచ్చి పూజలు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అభిషేకాలు, గణపతి హోమం, వాస్తు హోమం, అంకురార్పణ వంటి కార్యక్రమాలు జరుగుతాయి. తరువాతి రోజు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, కలశ స్థాపన, గిరిజ కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మరథోత్సవం, ప్రాకారోత్సవం, నిత్యహోమాలు, పుష్పపల్లకి వంటి వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉత్సవ రోజులలో అన్నదాన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక వేడుకలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోలాటాలు, భజనలు, నాటకాలు, భరతనాట్యం ప్రదర్శనలు నిర్వహిస్తూ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలను నిర్వహిస్తారు. రాత్రివేళల్లో జరిగే శివనామ సంకీర్తనలు భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి.
ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, ఆంజనేయ స్వామి వంటి పరివార దేవతాల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచూ వివాహాలు నిర్వహించడం మరో విశేషం. తక్కువ ఖర్చుతో పెళ్లి మండపం అందుబాటులో ఉండటంతో పేదలకు ఉచితంగా కూడా సౌకర్యం కల్పిస్తున్నారు. వసతి ఏర్పాట్లు, చిన్న కొలను, హోమశాల వంటి సదుపాయాలతో ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మికంతో పాటు సేవా ధోరణిని కూడా అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh
Feb 13, 2026 10:39 PM IST


