ఆర్థిక అసమానతలు తగ్గాలి – Visalaandhra


. అప్ప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు: సీఎం చంద్రబాబు
. పుట్టినరోజున అన్నక్యాంటిన్‌లో స్వయంగా వడ్డించిన సీఎం దంపతులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఫలాలు దక్కినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సంద ర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్‌కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్‌కు అల్పాహారం నిమిత్తం వచ్చేవారికి స్వయంగా ఇరువురూ వడ్డించారు. అనంతరం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి అల్పాహారం తీసుకున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదు. ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ… దేశానికి అన్నంపెట్టిన రాష్ట్రం మన ఏపీ. అన్న క్యాంటీన్లలో పేదల ఆనందం చూస్తే చాలా సంతృప్తిని ఇచ్చింది. పటమట అన్న క్యాంటీన్ చాలా పరిశుభ్రంగా ఉంది. పేదలు మూడు పూటలా భోజనం చేసే అవకాశం క్యాంటీన్లలో లభిస్తోంది. రూ.5 లకే మంచి ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆటో డ్రైవర్లు, ముఠా కార్మికులు, పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాలి. అక్షయపాత్ర ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌తో ఆహారం ఎంతో రుచిగా, నాణ్యతతో అన్నక్యాంటీన్లకు సరఫరా చేస్తున్నారని అభినందించారు.
అన్నం పెట్టేవారిని అరెస్ట్ చేశారు
‘గత ప్రభుత్వం దుర్మార్గంగా అన్నక్యాంటీన్లను మూసేసింది. భోజనం పెడతామంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇది వారి ఆలోచనా విధానానికి నిదర్శనం. పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు. అన్నక్యాంటీన్లు మూసివేసేందుకు వారికి మనసెలా వచ్చిందో ? అలాంటి వారు రాష్ట్రాన్ని పాలించారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజా ప్రభుత్వం వచ్చాక అన్నక్యాంటీన్లను పున:ప్రారంభించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయి. ఇటీవల 62 ప్రారంభించాం. ఇంకో 5 క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. గౌరవంగా పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకునేందుకు అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టాం. భువనేశ్వరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒక రోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వం అన్నం పెట్టలేక కాదు… కానీ అన్న క్యాంటిన్లను స్ఫూర్తికి వేదికగా మార్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నాం. ఇది ఒక ప్రజా ఉద్యమంలా మారాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పటమట అన్నక్యాంటీన్‌లో అందరితో కలిసి అల్పాహారం తీసుకున్న సీఎం చంద్రబాబు… అక్కడ వారిని భోజనం నాణ్యత, రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి వారితో కలిసి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఫోటోలు దిగారు.
సీఎం సహాయ నిధి నుంచి రూ.56 కోట్ల విడుదలకు సంతకం
ఆసుపత్రుల్లో చికిత్స పొంది సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి రూ.56.39 కోట్లు విడుదల చేసే దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు.
తన పుట్టిన రోజున పేదలతో కలసి అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన సీ¾ఎం… తరువాత పేదలకు లబ్ది చేకూర్చే ముఖ్యమంత్రి సహాయనిధి విడుదల ఫైలుపై సంతకం చేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 22 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 1,43,314 మంది లబ్ధిదారులకు రూ.1,298.33 కోట్లు అందజేయడం గమనార్హం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *