తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఇండీ కూటమిపై నిప్పులు చెరిగిన సీఎం ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

కోయంబత్తూరులో సీఎం చంద్రబాబు ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. అధికార డీఎంకే, ఇండీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్, డీఎంకేలను ద్రోహులని అన్నారు.

News18
News18

తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇండీ కూటమి లక్ష్యంగా నిప్పులు చెరిగారు. మహిళా బిల్లు, డీ-లిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మహిళా లోకానికి తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతో చిత్తశుద్ధితో రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే, కేవలం రాజకీయ స్వార్థం కోసమే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. ఈ చర్య ద్వారా ఇండీ కూటమి ఎన్డీఏను కాదు, దేశంలోని సగం జనాభా కలిగిన మహిళలనే ఓడించిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు ప్రస్తుత పాలకుల అవినీతి, కుంభకోణాల వల్ల ఆర్థికంగా వెనుకబడిందని విమర్శిస్తూ, దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాల్సిన డీఎంకే తన బాధ్యతను విస్మరించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మహిళా రిజర్వేషన్లు అమలైతే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగి దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని సీఎం పేర్కొన్నారు. 2029 ఎన్నికల నుంచే ఈ చట్టం అందుబాటులోకి రావాలని ప్రధాని మోదీ భావించినప్పటికీ, కాంగ్రెస్-డీఎంకే వైఖరి వల్ల ఆ అవకాశం చేజారిందని గుర్తు చేశారు. అసెంబ్లీ సీట్లు 50 శాతం పెరుగుతాయని స్పష్టంగా తెలుస్తున్నా, డీ-లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క మహిళలే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు కూడా తీవ్రంగా నష్టపోయాయని ఆరోపించారు.

దక్షిణాది ప్రయోజనాలపై మాట్లాడుతూ, 2027 సెన్సెస్ ప్రాతిపదికన ముందుకు సాగితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. గతంలో తాను ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడు దాహార్తిని తీర్చడానికి తెలుగు గంగ ప్రాజెక్టును ఎలా చేపట్టారో వివరించారు. ప్రస్తుతం ఏపీలో నదుల అనుసంధానం వేగంగా జరుగుతోందని, భవిష్యత్తులో గంగా-కావేరీ నదులను కలిపితే దేశంలో నీటి కొరత అనేదే ఉండదని తన దార్శనికతను పంచుకున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రభుత్వం జవాబుదారీతనంతో, పారదర్శకతతో పనిచేయాలని చంద్రబాబు హితవు పలికారు. ప్రజలు వాస్తవాలను గమనించి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. కోయంబత్తూరులో మీడియా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హోసూరుకు బయలుదేరారు. అక్కడ తళ్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *