Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు ఆమె గొంతుపై కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. గూడూరులోని అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన హరిత వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. ఆమె తిరుపతి జిల్లాలోని బాలాయపల్లి మండలం, గొట్టికాడు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు.

నిందితుడి పక్కా ప్లాన్

ఆటోలో హరితతో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే మార్గమధ్యలో చెన్నూరు మరియు తిప్పవరప్పాడు వద్ద మిగిలిన ప్రయాణికులు దిగిపోయారు. ఆటోలో ఉపాధ్యాయురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన డ్రైవర్, తనలోని కిరాతకుడిని బయటకు తీశాడు. చెమిర్తి గ్రామ సమీపానికి రాగానే, నిర్జన ప్రదేశంలో ఒక్కసారిగా వాహనాన్ని నిలిపివేశాడు.

ఏం జరుగుతుందో హరిత తెలుసుకునే లోపే, డ్రైవర్ తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ముఖ్యంగా ఆమె గొంతుపై మరియు చేతిపై కత్తితో బలంగా పొడవడంతో ఆమె తీవ్ర రక్తస్రావమై విలవిలలాడిపోయింది. ఆమె ప్రాణభయంతో కేకలు వేస్తున్నా వినకుండా, మెడలోని సుమారు ఒకటిన్నర సవర్ల బంగారు గొలుసును తెంచుకున్నాడు. అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి వేగంగా పరారయ్యాడు.

సకాలంలో స్పందించిన స్థానికులు

తీవ్ర గాయాలతో పడి ఉన్న హరితను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆమెను మొదట గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ గీతాకుమారి ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య నేతృత్వంలో బృందాలు గాలింపు చేపట్టి, సాంకేతిక ఆధారాల సహాయంతో కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, దోచుకున్న బంగారం, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆటోల్లో ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ప్రవర్తించే డ్రైవర్ల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *