600 ఏళ్ల క్రితం రాయలసీమ లవ్ స్టోరీ.. ఆఫ్ఘన్ వ్యాపారి, రాజకుమారి అమర ప్రేమగాథ..! Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony. | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

విజయనగర కాలంలో మొహియార్‌, చంద్రవదనల ప్రేమగాథ కదిరి ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి, వారి సమాధి ఇరు మతాల వారికి పవిత్ర స్థలంగా మారింది.

+

600

600 సంవత్సరాల క్రితమే ఆఫ్గానిస్తాన్ అబ్బాయి రాయలసీమ అమ్మాయి ప్రేమ ప్రేమకథ…

రాయలసీమ నేలలో శతాబ్దాల చరిత్ర, భక్తి, వీరగాథలతో పాటు హృదయాన్ని తాకే ప్రేమకథలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి అరుదైన అమర ప్రేమగాథల్లో ఒకటి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మొహియార్‌, కదిరి ప్రాంతానికి చెందిన రాజకుమారి చంద్రవదనల కథ. సుమారు 600 ఏళ్ల క్రితం విజయనగర సామ్రాజ్య కాలంలో చోటుచేసుకున్న ఈ ప్రేమగాథ నేటికీ స్థానికుల నోట వినిపిస్తూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

స్థానిక చరిత్రకారులు, పెద్దలు చెప్పిన వివరాల ప్రకారం, 15వ శతాబ్దంలో సామంత రాజు శ్రీరంగరాయుల ఏకైక పుత్రిక చంద్రవదన తరచుగా కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళ్లేది. ఒక రోజు ఆలయ దర్శనం ముగించుకుని వెళ్తుండగా అక్కడే దుకాణం పెట్టిన ఆఫ్ఘన్ వజ్రాల వ్యాపారి మొహియార్‌ను ఆమె గమనించింది. వజ్రాల కాంతికన్నా అతని వ్యక్తిత్వం, ఠీవి ఆమె మనసును ఆకర్షించాయి. అదే క్షణంలో మొహియార్‌ కూడా చంద్రవదన అందానికి ముగ్ధుడయ్యాడని చెబుతారు.

ఆ ఒక్క చూపే ఇద్దరి హృదయాల్లో ప్రేమ విత్తనం నాటింది. కానీ వారి మధ్య ఉన్న స్థాయి తేడాలు, మత భేదాలు ఆ ప్రేమకు అడ్డుగోడలయ్యాయి. బయటకు ఏమీ చెప్పుకోలేక ఇద్దరూ తమ తమ లోకాల్లోనే ఆ ప్రేమతో తల్లడిల్లారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరిని ఒకరు చూడాలనే తపన మరింత పెరిగింది. చివరకు చంద్రవదనను చూడాలనే ఆవేదనతో మొహియార్‌ రాజభవనం వద్దకు వెళ్లాడు.

అంతఃపురం వద్ద రాజభటులు అతన్ని అడ్డుకున్నారు. ప్రేమతో మైమరచి మాట్లాడుతున్న అతన్ని పిచ్చివాడిగా భావించి బలవంతంగా తోసేయడంతో గోడకు తల తగిలి అక్కడికక్కడే మొహియార్ ప్రాణాలు కోల్పోయాడని కథనం. ఈ విషయం తెలుసుకున్న చంద్రవదన అక్కడికి చేరుకుని అతని దేహంపై పడిపోయి ప్రాణాలు విడిచిందని స్థానిక గాథ చెబుతోంది. ఈ దృశ్యం చూసిన రాజు వారి ప్రేమను అర్థం చేసుకుని పెద్దల సలహాతో ఇద్దరికీ ఒకే ప్రదేశంలో సమాధులు నిర్మించించినట్లు చెబుతారు.

వారి సమాధులను హిందూ–ముస్లిం సంప్రదాయాల సమ్మేళనంగా నిర్మించారని, అది మత సామరస్యానికి నిదర్శనమని స్థానికులు విశ్వసిస్తారు. నేటికీ ఆ సమాధి స్థలాన్ని ఇరు మతాల వారు సందర్శిస్తూ, తమ ప్రేమలు ఫలించాలని మొక్కుకుంటారు. మొహియార్ శవం చంద్రవదన తాకే వరకు కదల్లేదని, చివరకు ఆమె కూడా అతనితోనే సజీవ సమాధి అయిందని మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. ప్రేమకు మతం లేదని, హృదయానికి సరిహద్దులు లేవని చెప్పే ఈ కదిరి ప్రేమగాథ తరతరాలుగా ప్రజల మదిలో నిలిచింది. చరిత్ర, జానపద గాథ, భక్తి, భావోద్వేగం ఇలా అన్నీ కలిసిన ఈ కథ నేటికీ స్థానిక సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *