కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
ఆంధ్రాలో రైతు దుస్థితి అశనిపాతంగా, ఆత్మహత్యా సదృశ్యంగా, అప్ప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ముప్పేట పెరిగి రైతు మెడకు ఉరితాడై బిగుస్తున్నాయి. అదునులో సకాలంలో పంట సాగు పెట్టుబడులకు ప్రభుత్వ రుణాలందక, సరైన దిగుబడి వంగడాల సరఫరా లేక, వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి, బోగస్ విత్తన కంపెనీల మోసాలకు బలై, వాతావరణ వైపరీత్యాల ధాటికి గురై ప్రతి సంవత్సరం రైతు కష్టనష్టాల్లో కన్నీరై కరిగిపోతున్నాడు. ఆర్థికంగా చితికిపోయి చివరికి ఉసురు తీసుకుంటున్నాడు. కల్తీ విత్తన కంపెనీల అనైతిక వ్యాపారం ఒక పక్క, పేదల రక్తం తాగే వడ్డీ వ్యాపారం మరో పక్క, పండిన పంటను సరైన ధరకు కొనని కొర్పొరేట్ ధాన్యం కొనుగోలు సంస్థలు ఇంకో పక్క, విచ్చలవిడిగా సమాజంలో విస్తరిస్తున్నా, విసృతమైన తనిఖీలతో కఠోరమైన శిక్షలతో చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు, చూసీ చూడనట్లు సమయాన్ని దాటేస్తున్నాయ్! అన్నదాత బతుకులతో ఆడుకుంటున్న అవినీతికి ఆలవాలమైన దందాలను దండించే ప్రభుత్వాలు కరువయ్యాయి. ఇదేమి కర్మమో! ఎన్నికల వేళ ఓట్లు అడిగే సందర్భంలో రాజకీయ నాయకుల మెదళ్లలో మెదిలే ఆలోచనల్లో పై అనైతిక దందాలన్నీ గుర్తుకువచ్చి, వాటిని అరికట్టే బాధ్యత అధికారంలోకి వచ్చాక చేస్తామంటూ హామీలు గుప్పిస్తుంటారు. అధికారం హస్తగతం కాగానే కరి మింగిన వెలగపండులా అన్ని వాగ్దానాలు అంతర్ధానమై పోతుంటాయ్. జనాన్ని మభ్యపెట్టే మరో సరికొత్త నినాదం తెరపైకి వస్తూంటూంది. ఓట్లేసిన నేరానికి ఆశ, అడియాసల సందిగ్ధంలో జనం కొట్టుమిట్టాడుతుంటారు. ఉపనాయకులు కల్లబొల్లి కబుర్లకు కరిగిపోతుంటారు. గతాన్ని వెంటనే మరచిపోతుంటారు.వార్తల్లో వైరలవుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం వలన అప్ప్పుడే మన దేశంలో గ్యాస్ కరువు కనిపిస్తూంది. నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశం అంటుతున్నాయి. గ్యాస్ కొరత మనకు లేదని మన ప్రభుత్వం ఎంత ఘోషిస్తున్నా వ్యాపారస్ధులు సృష్టించే కృత్రిమ కొరత సామాన్యున్ని కుంగదీస్తుంది. గ్యాస్ బండ బుక్ చేస్తే దాదాపు 25 రోజుల దాకా అతీగతీ ఉండడం లేదు. దీనికి తోడు అభద్రంలో భద్రతకై ఆరాటపడే అపర మేధావులు అవసరం లేకపోయిన, ఖాళీ సిలిండర్ల వేట సాగిస్తూ గ్యాస్ బుకింగ్‌లు చేస్తున్నారు. దీనితో కృత్రిమ డిమాండ్ తారస్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం అవినీతి దందాను కంట్రోలు చేసే చట్టాలు చేతులు ముడుచుకు కూర్చున్నాయి. నయవంచక అవినీతి దందా నడిపే ముఠాలు, ఎలాంటి వెరపు లేకుండా రాజకీయ నాయకుల అండదండలతో యధేచ్చగా వారి పని వారు చేసుకుపోతున్నారు. ఈ అన్యాయం ఏమిటని సామాన్య పౌరుడు నిలదీస్తే ఎదురు దాడికి దిగి అడిగిన వారి నోరు మూయిస్తున్నారు. అవినీతికి అర్రులు చాస్తున్న ఆర్థిక దోపిడీకి తెరలేపుతున్న అధికార రాజకీయమే ముందుండి ఈ పని చేయిస్తోందంటూ జనం వాపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద వర్గాల బతుకులు బజారున పడుతున్నాయి. లారీలకు లారీల రేషన్ బియ్యం తెల్లకార్డుదారులకు ఇవ్వకుండానే కొన్ని, వారిని ప్రలోభ పెట్టి అతి తక్కువ ధరకు కొని కొన్ని మిల్లర్ల గూటికి తరలిపోతున్నాయి. వీటిని అడ్డగించే అధికారే కరవయ్యాడు. పేదల జీవితాలను కల్లోల కడలిలోకి నెట్టే యత్నాలు, ఎత్తుగడలు పాలక వర్గాల నుంచే అమలులోకి వస్తున్నాయి.మరోపక్క పాలకుల నోటి నుంచి ప్రకృతి వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, ఆదాయాన్నిసృష్టిస్తా, ఆర్థిక వనరులను కల్పించే విధానాల్ని ఆచరణలోకి తెస్తామనే ఆశాజనకమైన వాగ్దానాలు వెలువడుతుంటాయి. చివరికి అవి ఆచరణ రూపం దాల్చకుండానే అంతర్ధానమవుతుంటాయి.ఆవులావులు పొట్లాడుకుంటూ లేగదూడల కాళ్లిరిసినట్లుగా పాలకపక్షం, ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలను గుప్పించుకుంటూ, జనాన్ని కులాల పేరుతో మతాల పేరుతో విడగొడుతూ, ఒక్కోసారి ప్రాంతాల దురభిమానాన్ని చొప్పించి వేరు చేస్తూ, చివరకు తాము ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చకుండానే దిగిపోతుంటారు. అధికారంలో లేకుండా దిగిపోయాక తిరిగి సరికొత్త మాటలతో పాత వాగ్దానాలకేñ సరికొత్త రూపమిచ్చి మళ్లీ వస్తుంటారు. నేడు పోటాపోటీగా బహిరంగ విమర్శలు చేసుకుంటున్న అధికార పక్షం, ప్రతిపక్షం నాయకులు జనాన్ని మాటలతో మభ్యపెట్టడం నేర్చుకున్నారు. దిగజారుడు రాజకీయానికి పెద్దపీట వేస్తున్నారు.నేటి పాలక రాజకీయం పరిస్థితి సైద్ధాంతిక వాతావరణం నుంచి ఉద్భవించడం లేదు. తమ సైద్ధాంతికత ఇది అని గాని, లక్ష్యం ఇది అని గాని, ఈ మార్గం ద్వారా లక్ష్యాన్ని పూర్తి చేస్తామని గాని చెప్పే స్థితిలో రాజకీయాలు లేవు. కేవలం లాలింపులతో, బుజ్జగింపులతో, సరికొత్త వాగ్దానాలతో కాలం వెళ్లబుచ్చే పరిస్థితికి దిగజారింది. ఏ రోటికా పాట పాడి పని గడుపుకుని, తిరిగి చూడని దుస్థితికి నేటి రాజకీయాలు వచ్చాయి. రాజకీయమంటే లౌకికమని, లౌకికమంటే తెలివిగా, చెప్పింది చేయకుండా తప్పించుకు తిరగడమేననే స్థితిలోకి రాజకీయం వచ్చింది. ఏది ఏమైనా పాలనా రాజకీయం గాని, ప్రతిపక్షంగా ఉన్న రాజకీయం గాని, నీతి, నిజాయితీకి స్వస్తి చెప్పి, ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ, తప్ప్పుడు హామీలు ఇస్తూ, నెరవేర్చడానికి సాధ్యపడని హామీలిస్తూ, వాగ్దానాలు చేస్తూ ఓట్లు దండుకొని అధికార పీఠమెక్కి, రాష్ట్రాన్ని అప్ప్పుల ఊబిలోకి నెట్టే అప్ప్పులు తెస్తూ, కంటి తుడుపు ఆర్థిక వనరుల్ని కల్పిస్తూ, పాలనా పబ్బం గడుపుకుని దిగిపోవడం ప్రజాద్రోహం, దేశ ద్రోహం అవుతుంది. ఈ సంగతి గుర్తెరిగి పాలకపక్షం వారుగాని, ప్రతిపక్షం వారుగాని తమ విధులను తాము నిర్వహించాలి. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని కుల,మత రహిత రాజకీయాన్ని అవలంబించాలి. ప్రోత్సహించాలి.
సెల్ : 9948774243


