Last Updated:
చిత్తూరు జిల్లాలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు, 19 రహదారులపై పనులు త్వరలో ప్రారంభం, ప్రయాణ సౌకర్యం మెరుగుదల ఆశలు
భారీ వర్షాల దెబ్బతో దెబ్బతిన్న రహదారులకు చిత్తూరు జిల్లాలో శుభవార్త లభించింది. పాడైపోయిన రోడ్లకు ఇక గుడ్‌బై చెప్పేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో 19 రహదారులను పునర్నిర్మించేందుకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 65 కిలోమీటర్ల పొడవైన రహదారులను మరమ్మతులు చేసి పునరుద్ధరించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గంగాధర నెల్లూరు, కుప్పం, నగరి, పలమనేరు, పూతలపట్టు వంటి కీలక నియోజకవర్గాల్లో ఈ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాచపాలెం నుంచి వనదుర్గాపురం వరకు బాలిగకండ్రిగ రహదారిని కలుపుతూ 3.150 కిలోమీటర్ల రహదారిని రూ.2.40 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే చిత్తూరు-పెనుమూరు-నేండ్రగుంట వయా ఆదిరిపల్లి మార్గంలో 1.9 కిలోమీటర్ల రహదారిని రూ.25 లక్షలతో పునరుద్ధరిస్తారు. చంద్రగిరి నుంచి వెదురుకుప్పం వరకు దోర్శకంబాల మార్గంగా 2.2 కిలోమీటర్ల రహదారిని రూ.40 లక్షలతో మెరుగుపరుస్తారు. చిత్తూరు నుంచి పుత్తూరు మార్గంలో నరసింగపురం, బలగంగనపల్లి మీదుగా 6.4 కిలోమీటర్ల రహదారిని రూ.70 లక్షలతో అభివృద్ధి చేయనున్నారు.
కుప్పం నియోజకవర్గంలో సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పం నుంచి నాయనూరు వరకు పెద్దవంక మార్గంగా తమిళనాడు సరిహద్దు వరకు 1.25 కిలోమీటర్ల రహదారిని రూ.45 లక్షలతో నిర్మిస్తారు. గడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఎస్.గొల్లపల్లి, కొనేరుకుప్పం మార్గంగా 1.40 కిలోమీటర్ల రహదారిని రూ.35 లక్షలతో అభివృద్ధి చేస్తారు. అలాగే కుప్పం నుంచి మల్లనూరు సరిహద్దు వరకు గరికచెనుపల్లి మార్గంగా 2.60 కిలోమీటర్ల రహదారిని రూ.40 లక్షలతో పునరుద్ధరిస్తారు.
నగరి నియోజకవర్గంలో ఏఆర్ రహదారి నుంచి సత్రవాడ వరకు గండ్రాజుకుప్పం మార్గంగా 7.0 కిలోమీటర్ల రహదారిని రూ.30 లక్షలతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే పెన్నలూరుపేట నుంచి వెంగలతూర్ వరకు 3.465 కిలోమీటర్ల రహదారిని రూ.60 లక్షలతో పునరుద్ధరిస్తారు. పలమనేరు నియోజకవర్గంలో రామకుప్పం నుంచి వి.కోట, పెర్నంబట్టు వరకు 8.845 కిలోమీటర్ల రహదారిని రూ.3.25 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
అదేవిధంగా ఎంబిటి రహదారి నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు బట్టమద్దడి మార్గంగా 0.8 కిలోమీటర్ల రహదారిని రూ.20 లక్షలతో, వి.కోట నుంచి కర్ణాటక సరిహద్దు వరకు అత్రపల్లి, కొంగాటం మార్గంగా 4.7 కిలోమీటర్ల రహదారిని రూ.20 లక్షలతో పునరుద్ధరిస్తారు. పూతలపట్టు నియోజకవర్గంలో చిత్తూరు అరుగొండ నుంచి మైనగుండ్లపల్లి వరకు 0.900 కిలోమీటర్ల రహదారిని రూ.30 లక్షలతో అభివృద్ధి చేస్తారు. చిత్తూరు ఐరాల నుంచి కారకాయపల్లి వరకు కాణిపాకం మార్గంగా 3.0 కిలోమీటర్ల రహదారిని రూ.50 లక్షలతో పునరుద్ధరిస్తారు. వుయ్యాలచింత-కీనాటంపల్లి రహదారిని 5.0 కిలోమీటర్ల మేర రూ.40 లక్షలతో మెరుగుపరుస్తారు.
ఇవి మాత్రమే కాకుండా ప్రధాన రాష్ట్ర రహదారులపై కూడా పనులు చేపడుతున్నారు. చిత్తూరు-పుత్తూరు రహదారిపై 4.2 కిలోమీటర్లకు రూ.3 కోట్లు, మరో విడతలో 1.6 కిలోమీటర్లకు రూ.30 లక్షలు కేటాయించారు. పుంగనూరు-కోలార్ రహదారిపై 3.8 కిలోమీటర్లకు రూ.50 లక్షలు, పుంగనూరు-పులిచర్ల-చిన్నగొట్టుగల్లు మార్గంలో 2.4 కిలోమీటర్లకు రూ.50 లక్షలు మంజూరు చేశారు.
మొత్తంగా జిల్లాలో కీలక గ్రామీణ, రాష్ట్ర రహదారులను ట్రాఫిక్‌కు అనుకూలంగా మార్చేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రావడంతో పాటు రవాణా సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని ఆశిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Andhra Pradesh



