Last Updated:
ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా, అంబేద్కర్ కోనసీమ, కాకినాడలో భారీ ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, చిన్నారుల వేషధారణ ఆకర్షణగా నిలిచాయి
ఏపీవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామం నుంచి నగరం వరకు ఎక్కడ చూసినా జై భీమ్ నినాదాలు మారుమోగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి.
ప్రత్యేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సంబరాలు మరింత వైభవంగా కనిపించాయి. ఆ మహానుభావుడి పేరును జిల్లా పేరుగా పెట్టిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. “మరిచిపోలేం మీ త్యాగాల్ని” అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు సైతం కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సేవలను స్మరించారు. పలు ప్రాంతాల్లో పాలు, పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.
ఇక కాకినాడ జిల్లాలో చిన్నారుల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిండా ఏడేళ్లు కూడా లేని చిన్నారులు అంబేద్కర్ వేషధారణలో వచ్చి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం అందరినీ ఆకట్టుకుంది. చిన్న వయస్సులోనే మహానుభావుడి గొప్పతనాన్ని గుర్తించి నివాళులు అర్పించడం విశేషంగా మారింది.
కాకినాడతో పాటు సామర్లకోట, తుని, పిఠాపురం, పెద్దాపురం ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రత్యేక ప్రసంగంతో అంబేద్కర్ త్యాగాలను వివరించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నేతృత్వంలో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి పాల్గొన్న ఈ వేడుకలు, అంబేద్కర్ ప్రభావం ఎంత గొప్పదో మరోసారి చాటిచెప్పాయి. ఆయన చూపిన మార్గం ఇప్పటికీ సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని ఈ సంబరాలు స్పష్టంచేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


