Last Updated:
తోటపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్ మళ్లీ ప్రారంభం, ఫ్యామిలీ బోట్స్ జెట్ స్కీ స్పీడ్ బోటింగ్ తక్కువ ధరలకు అందుబాటులోకి, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు మళ్లీ సందడిగా మారింది. గతంలో విజయవంతంగా కొనసాగిన ఈ బోటింగ్ సేవలు అనివార్య కారణాల వల్ల నిలిచిపోయాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి ప్రారంభించడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రిజర్వాయర్ వద్ద వివిధ రకాల బోటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సేదతీరేందుకు ఫ్యామిలీ బోట్స్, యువతకు ఆకర్షణగా జెట్ స్కీ, స్పీడ్ బోటింగ్, కాయక్, లెగ్-పెడల్ బోటింగ్, డీలక్స్ బోటింగ్ వంటి విభిన్న రకాల బోట్లు ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాలు అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటున్నాయి.
సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలను కూడా తక్కువగా నిర్ణయించారు. ఫ్యామిలీ బోటు ప్రయాణం రూ.100గా, స్పీడ్ బోటింగ్ రూ.200గా, పెడల్ బోట్ రూ.100గా నిర్ణయించడం విశేషం. తక్కువ ఖర్చుతో మంచి వినోదాన్ని అందించే ఈ బోటింగ్ సేవలు ప్రజల ఆదరణను పొందుతున్నాయి. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి బోటుకు అనుభవజ్ఞులైన డ్రైవర్లు నియమించగా, రక్షణ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.
ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా అందిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు స్పందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవికాలంలో సాయంత్రం వేళల్లో తోటపల్లి రిజర్వాయర్ పరిసరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం మధ్య కుటుంబాలు, స్నేహితులు పెద్ద ఎత్తున వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుందని అక్కడి సిబ్బంది తెలిపారు.
పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు రిజర్వాయర్ పక్కనే పార్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు ఉండగా, పెద్దలు విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు కల్పించారు. దీంతో ఒకే చోట వినోదం, విశ్రాంతి, ప్రకృతి అందాలు ఆస్వాదించే అవకాశం లభిస్తోంది.
తోటపల్లి రిజర్వాయర్ బోటింగ్ మళ్లీ ప్రారంభం కావడం స్థానికంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చింది. సమీప ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. అధికారులు ఈ సేవలను మరింత విస్తరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


