Gudivada Amarnath: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు.. 6 నెలల జైలు శిక్ష.. జరిమానా కూడా.. అలా చేసినందుకేనంట..! Gudivada Amarnath suicide attempt case. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖ రైల్వే జోన్ నిరాహార దీక్ష కేసులో గుడివాడ అమర్నాథ్ కు ఆరు నెలల జైలు శిక్ష, ఐదు వేల జరిమానా, తీర్పుతో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి

+

మాజీ

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి 6 నెలలు జైలు శిక్ష , జరిమాన

విశాఖలో రైల్వే జోన్ కోసం జరిగిన ఒక నిరాహార దీక్ష, దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు తీర్పుతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన కేసులో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఆయనకు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి.

ఈ ఘటన 2016 ఏప్రిల్ 17న జరిగినది. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం గాంధీ విగ్రహం వద్ద గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష కొనసాగుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు జోక్యం చేసుకుని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ చర్యను అప్పటి పోలీసులు ఆత్మహత్యాయత్నంగా పరిగణించి కేసు నమోదు చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు అప్పటి నుంచి కోర్టులో విచారణలో కొనసాగుతూ వచ్చింది.

దీర్ఘకాల విచారణ అనంతరం, కేసులో సమర్పించిన ఆధారాల ఆధారంగా కోర్టు అమర్నాథ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు నిర్ధారించింది. దీంతో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడగానే రాజకీయంగా మళ్లీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ తన పోరాటాన్ని సమర్థించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలను అమలు చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యల కోసం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తాను ఆ నిరాహార దీక్ష చేపట్టానని తెలిపారు.

రైల్వే జోన్ కోసం నేను చేసిన పోరాటానికి నాకు వచ్చిన ఫలితం ఈ జైలు శిక్ష అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని, అవసరమైతే ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమేనని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. తన పోరాటం పూర్తిగా ప్రజల కోసమేనని, వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని స్పష్టం చేశారు.

ఇప్పుడీ తీర్పుతో మరోసారి రైల్వే జోన్ అంశం చర్చకు రావడంతో పాటు, రాజకీయంగా కూడా కొత్త వాదోపవాదాలకు తెరలేపింది. ఒకప్పుడు జరిగిన నిరసన, ఇప్పుడు కోర్టు తీర్పుతో కొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామం భవిష్యత్తులో మరిన్ని రాజకీయ చర్చలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *