Last Updated:
Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు.
Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. సుమారు 6.5 సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో గార్డెనింగ్ వీడియోలు చూసి ప్రేరణ పొందిన ఆమె, లాక్డౌన్ సమయంలో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. కోవిడ్ తొలి దశలో తాను మరియు తన భర్త తీవ్రంగా అనారోగ్యానికి గురవడంతో “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నిజాన్ని ఆమె బలంగా గ్రహించారు. అదే సమయంలో సేంద్రీయ ఆహారం అవసరాన్ని గుర్తించి, ఇంటి వద్దే కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఆకుకూరలతో ప్రారంభించిన హిమబిందు, తరువాత వంకాయ, బెండకాయ, టమోటా, మిర్చి వంటి కూరగాయలను పండిస్తూ, వాటిలో విభిన్న రకాలను పెంచడం మొదలుపెట్టారు.
తర్వాత తీగ జాతి మొక్కలు అయిన బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ వంటి పంటలను పెంచడంలో నైపుణ్యం సాధించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో “సిటీ టెర్రస్ గార్డెన్ శ్రీకాకుళం ” గ్రూప్ గురించి తెలుసుకుని, ఆ గ్రూప్ అడ్మిన్ అనూరాధ పెర్ల ప్రోత్సాహంతో అందులో చేరారు. ఆ గ్రూప్ ద్వారా అనేక కొత్త విషయాలు నేర్చుకుని, పండ్ల మొక్కలను కూడా గ్రూప్ ఆర్డర్ ద్వారా తెప్పించి సేంద్రీయ విధానంలో పెంచుతున్నారు.
ఇప్పుడు ఆమె ఇంట్లో దాదాపు 30కి పైగా రకాల మొక్కలు పెరుగుతున్నాయి. అలాగే కలువ పువ్వులు, వాటర్ లిల్లీస్ వంటి వాటర్ ప్లాంట్స్‌ను కూడా విస్తృతంగా పెంచుతున్నారు. హిమబిందుకు కిచెన్ గార్డెన్తో పాటు టెర్రస్ గార్డెన్ కూడా ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ, తన సమయాన్ని సక్రమంగా నిర్వహిస్తూ, కుటుంబానికి అవసరమైన ఆహారాన్ని తానే పండించుకోవాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
ఆమె పిల్లలు హర్షిత్ (9 ఏళ్లు), ధీరజ్ (4 ఏళ్లు) కూడా గార్డెనింగ్‌లో పాల్గొనడం విశేషం. వారానికి ఐదు రోజుల పాటు కుటుంబానికి సరిపడే కూరగాయలను ఆమె తానే పండిస్తున్నారు. ముఖ్యంగా ఆమె పెంచే దొండకాయ మొక్క గ్రూప్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ఒక్క మొక్క వారానికి సుమారు 5 కిలోల దిగుబడి ఇస్తోంది.
సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా, హిమబిందు ఇంటి కిచెన్ వ్యర్థాలతోనే ఎరువులు తయారు చేసుకుంటున్నారు. వేపపిండి, ఆవు ఎరువు, బియ్యం కడుగు నీరు, పులిసిన అరటిపండు నీరు వంటి సహజ పదార్థాలను ఉపయోగించి మొక్కలకు పోషకాలను అందిస్తున్నారు. ఇంటి చుట్టూ ఆక్సిజన్ ప్లాంట్స్‌ను కూడా పెంచుతూ పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. తన ఇంటి ముందు, వెనుక, టెర్రస్ పై, ఇంటి చుట్టూ ఉన్న ప్రతి ఖాళీ ప్రదేశాన్ని వినియోగించి మొక్కలను పెంచుతున్న హిమబిందు, పక్కింటి వారికి కూడా మొక్కలు, కూరగాయలు పంచుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆమె కృషికి గుర్తింపుగా 2025లో విశాఖ ఆర్గానిక్ మేళాలో “బెస్ట్ టెర్రస్ గార్డెనర్” అవార్డు, సిక్కోలు హరిత మహోత్సవంలో “టెర్రస్ గార్డెనర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు లభించాయి. అలాగే 2025 సంవత్సరానికి “రైతు నేస్తం” అవార్డుకు కూడా ఎంపికయ్యారు.భర్త ప్రభాకర్ రావు పూర్తి సహకారంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని హిమబిందు తెలిపారు. ఆమె కథ, సేంద్రీయ సాగు ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హోమ్ రెమిడీస్, పేరెంటింగ్ టిప్స్, రిలేషన్షిప్ గైడెన్స్, ఫిట్నెస్, యోగా టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ స్టోరీస్‌ని న్యూస్ 18 తెలుగు లైఫ్‌స్టైల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Srikakulam,Andhra Pradesh


