Last Updated:
తిరుపతి పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో ఆన్‌లైన్ మోసం బయటపెట్టారు, సి సెంథిల్ కుమార్ అరెస్ట్, ఒక్క టికెట్‌కు 16500 వసూలు, భక్తులకు అధికారిక టీటీడీ సైట్ మాత్రమే వినియోగించమని హెచ్చరిక
తిరుపతి జిల్లా పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో అమాయక భక్తులను మోసం చేస్తున్న పెద్ద మోసాన్ని వెలికితీశారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాకు చెందిన సి.సెంథిల్ కుమార్ (47) అనే వ్యక్తిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో WhatsApp, Facebook, Instagram వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా “త్వరితగతిన శ్రీవారి దర్శనం”, “అత్యంత సమీపంలో దర్శనం” అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తూ భక్తులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్, తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా తమిళనాడులో దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో నిందితుడు టీటీడీ లోగోను దుర్వినియోగం చేస్తూ “VIP దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి” అని తప్పుడు ప్రచారం చేసినట్లు తేలింది. ఒక్కో టిక్కెట్‌కు సుమారు రూ.16,500 వసూలు చేస్తూ, తన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, ఫోన్‍పే ద్వారా డబ్బులు స్వీకరించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ హామీలు ఇచ్చి భక్తులను మోసం చేసిన ఈ వ్యవహారంలో అతని వద్ద నుంచి ఒక డెల్ ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాల్లో దర్శనం టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించిన సమాచారం, AI వీడియోలు, సోషల్ మీడియా చాట్ రికార్డులు లభించాయి. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసులు భక్తులకు కీలక సూచనలు చేశారు. తిరుమల దర్శనం టిక్కెట్లు కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా అనుమతించిన కౌంటర్ల ద్వారానే పొందాలని, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, ఎవరికీ ముందస్తుగా డబ్బులు పంపించవద్దని సూచించారు. అలాగే గూగుల్ సెర్చ్‌లో గెస్ట్ హౌస్ పేర్లతో కనిపించే అన్ని వెబ్‌సైట్లు అధికారికం కావని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, దర్శనం, వసతి పేరుతో మోసాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



