పలమనేరు ట్రాన్స్కోలో మామూళ్ల మాఫియా..? రైతుల రక్తం తాగుతున్న అవినీతి యంత్రాంగం..! regular scam in palamaneru spdcl farmers angry | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

పలమనేరు ఎస్పీడీసీఎల్ పరిధిలో భారీ అవినీతి ఆరోపణలు, మామూళ్లు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్లు సర్వీసులు, జేఎల్ఎం సంజు నాయక్ వీడియోతో ఉద్రిక్తత, రైతులు ధర్నా, విచారణ హామీ మాత్రమే

+

పలమనేరు

పలమనేరు ఏపి ఎస్పీ డీ సీ ఎల్ పరిధిలో రాజ్యమేలుతున్న అవినీతి పట్టిచుకొని ఉన్నతాధిక

పలమనేరు ఎస్పీడీసీఎల్ సబ్‌డివిజన్ పరిధిలో అవినీతి రాజ్యం నడుస్తోందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఎక్కే హెల్పర్ నుంచి ఏఈ, ఏఈఈ స్థాయి అధికారుల వరకు వాటాలు ఫిక్స్ చేసుకుని రైతులపై భారంగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, కరెంట్ స్తంభాలు మార్పిడి చేయాలన్నా, అధిక వోల్టేజ్ వల్ల తీగలు దెబ్బతిన్నా.. ప్రతి చిన్న పనికీ మామూళ్లు తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

డబ్బులు ఇస్తే పనులు వేగంగా పూర్తవుతున్నాయనీ, లేదంటే కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీకోట, బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు మండలాల్లో ఈ దందా తారస్థాయికి చేరిందని రైతులు చెబుతున్నారు.

గంగవరం విద్యుత్ కార్యాలయంలో పని చేసే జేఎల్ఎం సంజు నాయక్ రైతుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బాధితులు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతూ ఇది విద్యుత్ శాఖ కాదు.. అవినీతి శాఖ అంటూ నినాదాలు చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతుండగా, విద్యుత్ శాఖలో మామూళ్ల భారం మరింత కష్టాల్లోకి నెడుతోందని అంటున్నారు. ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేయాలన్నా, కొత్త సర్వీసులు మంజూరు చేయాలన్నా డబ్బులు ఇవ్వకపోతే నిబంధనల పేరిట ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గంగవరం మండలం దండపల్లికి చెందిన రైతు వెంకటేశు ఐదు నెలల క్రితం బోరుకు కరెంట్ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సాధారణంగా సీరియల్ ప్రకారం సర్వీసులు ఇవ్వాల్సి ఉండగా, లైన్‌మన్ బాలాజీతో డీల్ కుదిరిన తర్వాతే పనులు కదిలాయని సమాచారం. కొటేషన్ ప్రకారం మూడు స్తంభాలు, 15 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉన్నా, మామూళ్లు అందిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ఆరు స్తంభాలు, 25 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపుతోంది.

అదే గ్రామంలో ఓ వెంచర్‌కు మాత్రం కొద్ది రోజుల్లోనే స్తంభం, మీటర్ సౌకర్యం కల్పించడం రైతుల్లో అనుమానాలకు తావిస్తోంది. డబ్బులు ఇచ్చే వారికి వెంటనే పనులు, ఇవ్వనివారికి ఆలస్యం అనే విధానం నడుస్తోందని వారు మండిపడుతున్నారు. ఇక బైరెడ్డిపల్లి ఏఈపై ఇప్పటికే ఆరోపణలు రావడంతో జీతం నిలిపివేసినా, కింది సిబ్బంది ద్వారా మామూళ్ల వ్యవహారం కొనసాగుతోందని సమాచారం. గంగవరం ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

దండపల్లికి చెందిన సీతమ్మ 2024 మార్చి 11న వ్యవసాయ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ కనెక్షన్ రాలేదు. అధికారులను అడిగితే పైనుంచి ఉత్తర్వులు రావాలి అంటూ కాలయాపన చేస్తున్నారని ఆమె వాపోతున్నారు. ఇలాంటివారు సుమారు 1500 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. కానీ మామూళ్లు ఇచ్చిన వారికి మాత్రం వెంటనే సర్వీసులు మంజూరు అవుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఉచితంగా మార్పిడి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం డబ్బులు లేకుండా పని జరగదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వ్యవహారం చూస్తుంటే మాకు మామూళ్లే ముఖ్యం అన్నట్టుగా ట్రాన్స్కో సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా, కింది స్థాయిలో మార్పు ఎప్పుడు వస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు మాత్రం పలమనేరు రైతుల పరిస్థితి కరెంట్ కోసం కష్టాలు అనుభవిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *