Macherla Suicide: సాగర్ కాల్వలో తేలిన మృతదేహాలు.. ఒకే చున్నీతో కట్టబడి ఉన్న తల్లీబిడ్డలు.. అసలేం జరిగింది? |


Last Updated:

మాచర్లలో విషాదం, అనారోగ్యంతో చిన్న కూతురు యశ్విక మృతితో మానసిక వేదనకు గురైన అమరేశ్వరి, మూడేళ్ల లలితశ్రీతో కలిసి సాగర్ కుడి కాల్వలో దూకి ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు కానీ, కళ్ళముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం ఏ తల్లికైనా నరకప్రాయం. అప్పటివరకు పాలుతాగిన పసికందు అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లిపోతే, ఆ కడుపుకోతను భరించడం ఎవరికైనా అసాధ్యం. అచ్చం అటువంటి మానసిక వేదననే అనుభవించింది ఒక తల్లి. ఆ బాధ ఎంత తీవ్రమైనదంటే, తన పక్కనే ఉన్న మరో బిడ్డను కూడా తీసుకుని తను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

మాచర్ల పట్టణం రెండో వార్డుకు చెందిన వెంకటశివ, అమరేశ్వరి (23) దంపతులది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. వెంకటశివ కుట్టుమిషన్లు రిపేర్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లలితశ్రీ (3), చిన్న కుమార్తె యశ్విక (ఏడాదిన్నర). పిల్లల నవ్వులతో ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతుండేది. కానీ, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.

చిన్న కుమార్తె యశ్విక గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఫిబ్రవరి 17న మరణించింది. ఏడాదిన్నర ప్రాయంలోనే చిన్నారి తనువు చాలించడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. ముఖ్యంగా తల్లి అమరేశ్వరి ఆ మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. తన బిడ్డ తనను విడిచి వెళ్లిపోయిందన్న ఆలోచన ఆమెను నిరంతరం వేధించింది. మానసిక క్షోభకు గురైన ఆమె, విపరీతమైన నిర్ణయానికి సిద్ధపడింది.

బుధవారం ఉదయం, అమరేశ్వరి మనసులో ఏదో తెలియని శూన్యం ఆవరించింది. చనిపోయిన చిన్న కూతురిపై ఉన్న మమకారం, ఇప్పుడున్న పెద్ద కూతురిని పోగొట్టుకునేలా చేసింది. తన మూడేళ్ల కుమార్తె లలితశ్రీని తీసుకుని మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలోని సాగర్ కుడి కాల్వ వద్దకు చేరుకుంది.

ఆ చిన్నారికి అసలేం జరుగుతుందో తెలియదు. అమ్మ తనను ఎక్కడికో తీసుకెళ్తుందని ఆ పసిది నమ్మి ఉంటుంది. అమరేశ్వరి తన కూతురిని చున్నీతో నడుముకు గట్టిగా కట్టుకుంది. ఇద్దరూ విడిపోకూడదన్న తాపత్రయమో లేక బిడ్డ తప్పించుకోకూడదన్న భయమో కానీ, ఆ క్రూరమైన నిర్ణయంతో కాల్వలోకి దూకింది. నీటి ప్రవాహం వారిద్దరినీ ముంచేసింది. కొద్దిసేపటికే ఇద్దరూ ప్రాణాలు విడిచారు.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, విజయపురి సౌత్ ఎస్సై అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. తన నడుముకు చున్నీతో కట్టబడి ఉన్న మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని చూసి పోలీసులు, స్థానికులు చలించిపోయారు. ఆ చిన్నారి తప్పు ఏముందని, ఆ తల్లి ఎందుకు అంతటి కఠిన నిర్ణయం తీసుకుందని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో మాచర్ల ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *