తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వీటి ప్రభావంతో బుధవారం (08-04-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం (09-04-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
మంగళవారం రాత్రి 7 గంటల నాటికి శ్రీకాకుళం (జి) కోర్లాం 59.5 మిమీ, అనకాపల్లి(జి) రాజంలో 54మిమీ, చూచుకొండలో 39.5మిమీ, అనకాపల్లిలో 37.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. మరోవైపు బుదవారం ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్లో గరిష్ఠ ఉష్ణోగ్రత మంగళవారం నమోదైందని,155 మండలాల్లో 40°C కుపైగా ఉష్ణోగ్రత రికార్డు అయిందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
మంగళవారం మార్కాపురం(జి) బోట్లగూడూరులో 43.4°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 43.2°C, తిరుపతి (జి) వెంకటగిరిలో 43.1°C, చిత్తూరు(జి) సింధురాజపురం, నెల్లూరు(జి) నెల్లూరుపాలెంలో 42.6°C, పల్నాడు(జి) పిడుగురాళ్లలో 42.2°C, ఎన్టీఆర్(జి) చందాపురం, కడప(జి) ఒంటిమిట్టలో 41.9°C, నంద్యాల(జి) బనగానపల్లెలో 41.2°C, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 41.1°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


