వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు

ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా
ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ జిల్లా, “జలధార” కార్యక్రమంతో నీటి భద్రత సాధించడమే కాకుండా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల్లో జల వనరుల స్థిరత్వంపై జరిగిన వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, అన్నమయ్య జిల్లా సాధించిన పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ (Nishant Kumar)ను ప్రత్యేకంగా ఆహ్వానించి, జలధార ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో అమలు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సాధించిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కేవలం ఐదు నెలల్లోనే భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 మైనర్ ఇరిగేషన్ చెరువుల పునరుద్ధరణ, సుమారు 20,000 ఎకరాల భూభాగానికి నీటి రీచార్జ్ జరగడం వంటి అంశాలు జలధార విజయానికి నిదర్శనాలుగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.

జలధార కార్యక్రమం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలపై కూడా సానుకూల ప్రభావం పడిందని, నీటి సంరక్షణలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కరువు జిల్లాను నీటి భద్రత దిశగా తీసుకెళ్లిన ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ కృషిని ప్రత్యేకంగా అభినందించిన ఉప ముఖ్యమంత్రి, అంకితభావంతో పనిచేసి సాధించిన ఈ విజయం ప్రతి జిల్లాకు మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. అందుబాటులో ఉన్న వనరులతోనే గొప్ప ఫలితాలు సాధించవచ్చని అన్నమయ్య జిల్లా నిరూపించిందని కొనియాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో బేసిన్ ఆధారిత నీటి సంరక్షణ విధానాన్ని అమలు చేసి, నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి మిగులు నీటిని లోటు ప్రాంతాలకు మళ్లించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పెన్నా నది పరివాహక ప్రాంతం, చెయ్యరు, పాపాగ్ని ఉపనదులను సమర్థంగా వినియోగించడం ద్వారా నీటి నిల్వలు పెరిగాయని వివరించారు.

అలాగే 49 ఉప పరివాహక ప్రాంతాల గుర్తింపు, 532 కాస్కేడ్స్ ద్వారా 382 చెరువుల అనుసంధానం, 962 ఎండిపోయిన చెరువుల పునరుద్ధరణ, ఉపాధి హామీ పథకం ద్వారా విస్తృత పనులు చేపట్టడం వంటి చర్యలతో వృథాగా పోయే నీటిని వినియోగంలోకి తీసుకురాగలిగామని తెలిపారు. భారీ వ్యయంతో చేసే ప్రాజెక్టులకు బదులుగా తక్కువ ఖర్చుతోనే 3-4 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ సదస్సులో జల వనరుల శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాల్గొని జలధార ప్రాజెక్టును విశ్లేషించారు. అన్నమయ్య జిల్లా సాధించిన ఈ విజయం భవిష్యత్‌లో రాష్ట్ర నీటి నిర్వహణ విధానాలకు మార్గదర్శకంగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *