Bribery Case: మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం.. ఆ పని కోసం రైతు నుంచి రూ. 10 లక్షల డిమాండ్! |


Last Updated:

అన్నమయ్య జిల్లా మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి పై రైతు నుంచి భూ ఎన్ఓసీకి 10 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలు, 5 లక్షలు అక్క ఖాతాకు ఆన్‌లైన్ జమ, కలెక్టర్ విచారణ ప్రారంభం

+

అన్నమయ్య

అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తహసిల్దార్ అవినీతి బాగోతం..!

సామాన్యుడికి అండగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, అక్రమార్కుల అడ్డాగా మారుతోందన్న విమర్శలకు తాజా సంఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వెలుగుచూసిన భారీ అవినీతి అక్రమాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒక భూ సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేయడం, అందులో సగం మొత్తాన్ని ఏకంగా తన సొంత బంధువుల ఖాతాకే మళ్లించడం వంటి సాహసోపేతమైన అవినీతికి తహసీల్దార్ పాల్పడటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లి ప్రాంతానికి చెందిన రైతు రవి తన భూమికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి గత కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, పని పూర్తి చేయాల్సిన తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, సదరు రైతు నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భూమికి సంబంధించిన ఎన్ఓసీ (NOC) క్లియర్ చేయాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని సదరు అధికారి ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, లంచం తీసుకునే పద్ధతి. సాధారణంగా అవినీతి అధికారులు నగదు రూపంలో లంచం తీసుకోవడానికి భయపడతారు. కానీ, ఇక్కడ తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఏకంగా తన అక్క ఖాతాకే రూ. 5 లక్షలు ఆన్‌లైన్ ద్వారా జమ చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డిజిటల్ సాక్ష్యాలు దొరుకుతాయని తెలిసినా, ఇంత బరితెగించి లంచం తీసుకోవడం వెనుక ఉన్న ధైర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన రూ. 5 లక్షల కోసం రైతుపై నిరంతరం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ పలు వివాదాస్పద భూములకు ఎన్ఓసీలు జారీ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారని విమర్శలు ఉన్నాయి. ఒక ప్రముఖ యువనేత అండదండలు పుష్కలంగా ఉండటంతో, నిబంధనలను తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అధికారులను, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి.

ఈ అవినీతి భాగోతం బయటపడటంతో జిల్లా కలెక్టరేట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్‌ను కలెక్టరేట్‌కు సరెండర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తహసీల్దార్ స్థాయిలో జరుగుతున్న ఇంతటి భారీ దోపిడీని అరికట్టడంలో విఫలమయ్యారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మొత్తానికి మదనపల్లి రెవెన్యూ వ్యవస్థలో భారీ ప్రక్షాళన మొదలైందని అర్థమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *