Last Updated:
ఆరు నెలలుగా గోదావరి ప్రాంతంలో భయపెట్టిన భారీ మొసలిని అంబేద్కర్ కోనసీమలో వలలో పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించగా, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచించారు.
ఆరు నెలలుగా కాలువల్లో, చెరువుల్లో, వాగుల్లో కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన భారీ మొసలి కథకు ఎట్టకేలకు క్లైమాక్స్ వచ్చింది. ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులను మోసం చేస్తూ తప్పించుకుంటున్న ఈ ముసలి, చివరకు ఓ వలలో చిక్కి పట్టుబడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలకు నిద్రపట్టనీయకుండా చేసిన ఈ ఘటనకు ముగింపు పలుకుతూ, స్థానికులు మరియు అటవీశాఖ కలిసి చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ప్రశాంతతకు మారుపేరైన గోదావరి ప్రాంతంలో ఇటీవలి కాలంలో అడవి జంతువుల సంచారం పెరుగుతోంది. ఒకవైపు పెద్దపులి, మరోవైపు ఈ మొసలి ప్రజల్లో భయాందోళనలు రేపాయి. ఆరు నెలల క్రితం వరదల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానించారు. అప్పటి నుంచి ఈ ముసలి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ అధికారులకు సవాల్ విసిరింది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మొసలిని పట్టుకోవడం అటవీశాఖకు సవాలుగా మారింది. ఒక చోట కనిపిస్తే, మరొకచోటికి చేరి తప్పించుకోవడం దీని ప్రత్యేకతగా మారింది. చివరకు చేపల కోసం వేసిన వలలో ఈ మొసలి చిక్కడంతో స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అయినవిల్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ కీలక ఆపరేషన్ విజయవంతమైంది.
అయితే పట్టుకున్న తర్వాత కూడా ముసలి సైలెంట్‌గా ఉండలేదు. తరలించే సమయంలో ఒక్కసారిగా తప్పించుకుని పరుగులు తీసింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు ప్రాణాలను పణంగా పెట్టి దాన్ని వెంబడించి మరోసారి పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వారి ధైర్యసాహసం లేకపోతే ముసలి మళ్లీ తప్పించుకునే ప్రమాదం ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ మొసలిని అనుకూలమైన సహజ వాతావరణంలో విడిచిపెట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నెలల తరబడి ప్రజలను భయపెట్టిన ఈ ముసలి కథ సుఖాంతం కావడంతో కోనసీమ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ గోదావరి ప్రాంతంలో అడవి జంతువుల సంచారం పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh
Apr 05, 2026 11:00 PM IST


