Last Updated:
కాకినాడలో అక్రమ మాంసం ఆశ్చర్యపోయిన ప్రజలు
Fake Mutton: మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా..! మార్కెట్లో కేజీ 1200 రూపాయలు ఉన్న మటన్ కేవలం రూ. 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. చికెన్ తో సమానంగా మటన్ వస్తుందని ఆశ్చర్యానికి లోనై మటన్ ఇంటికి తీసుకెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త? మీరుతినేది మటనో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో మటన్ ప్లేస్ లో బీఫ్ లేదా చనిపోయిన మేక మాంసం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటన ఒక ప్రాంతంలో బహిరంగం కావడంతో ప్రజలు , మేకల వ్యాపారులు సైతం షాక్ అయ్యారు. ఎక్కడా లేని వ్యాపారం ఆ ఒక్కడికే జరగడం ఏంటి అని ఆరా తీస్తే.. ఆవ్యక్తి బీఫ్ మాంసం , చనిపోయిన మేకలను కట్ చేసి మటన్ గా విక్రయిస్తున్నాడని తేలింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగడంతో అసలు గుట్టురట్టైంది. కాకినాడ జిల్లాలో జరిగిన ఈసంఘటన ఇప్పుడు మటన్ ప్రియులకు ముద్ద మింగుడు పడనివ్వడం లేదు.
అయితే కల్తీ లేదంటే నకిలీ సరుకులు మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. వినియోగదారులకు ఆఫర్లు, ఉచితం పేరుతో నాసీరకం సరుకులు, ఆహార పదార్ధాలు అంటగడుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. కాని తాజాగా మాంసం కూడా కల్తీ చేస్తున్న వార్త ఇప్పుడు కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. కాకినాడ రూరల్‌లో మేక మాంసం అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని స్వయంగా మేక మాంసం యూనియన్ ప్రతినిధుల స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజు ఆ ప్రాంతంలో మాంసం కొనుగోలు చేసేందుకు అనేకమంది వస్తూ ఉంటారు. అయితే ఒక్కదుకాణంలో మాత్రం కేజీ మటన్ ధర రూ.500లకు విక్రయిస్తున్నారు. రూ.1000 రూపాయలు కేజీ మటన్ ధర బహిరంగ మార్కెట్లో అమ్మతుంటే అక్కడ మాత్రమే ఎందుకు అలా సగానికి సగం తగ్గించి అమ్మడంతో జనం ఎగబడి మరీ కొనుక్కోవడం మొదలుపెట్టారు.
వెయ్యి రూపాయలు కిలో మటన్ ధర దాటినప్పటికి సగానికి సగం తగ్గించి ఎందుకు అమ్ముతున్నాడు.. అతనికి ఏం లాభం వస్తుందనే అనుమానం అందరితో పాటు ఇక్కడ మటన్ విక్రయిస్తున్న మరికొందరు మాంసం వ్యాపారులకు రావడంతో అసలు నిజం బయటపడింది. ఇదే విషయంపై నిదానంగా ఆరా తీస్తే మటన్ ప్లేస్ లో బీఫ్ అమ్ముతున్నారని గ్రహించారు? దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇటువంటి వ్యాపారుడు వల్ల మిగిలిన వారందరికీ చెడ్డ పేరు వస్తుందని ఇటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ వద్దకు మటన్ వ్యాపార సంఘం చేరుకుని ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి, ఒక్క కాకినాడ రూరల్ అనే కాకుండా గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలలో ఈ అక్రమ మాంసం వ్యాపారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని చనిపోయిన మేకలైతే మరికొన్ని జంతువుల మాంసాలను కూడా మేక మాంసంగా అమ్మకాలు జరుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు, ఏదేమైనా ఈ ఘటన దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Kakinada,East Godavari,Andhra Pradesh


