Last Updated:
ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు. కిలో టమాటకు రూపాయి కూడా పలకకపోవడం బాధాకరమని రైతు నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాని ఎం పనుకువలస గ్రామానికి చెందిన టమాట రైతులు పంటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Tomato Farmers: ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు. కిలో టమాటకు రూపాయి కూడా పలకకపోవడం బాధాకరమని రైతు నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాని ఎం పనుకువలస గ్రామానికి చెందిన టమాట రైతులు పంటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న ఒక ఎకరా భూమిలో టమాట సాగు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పంట కోసం విత్తనాలు, ఎరువులు, మందులు, కార్మిక ఖర్చులు తదితరాలకు కలిపి సుమారు రూ.50,000 వరకు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. మంచి దిగుబడి వచ్చినప్పటికీ, మార్కెట్లో ధరలు లేకపోవడం వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పండించిన టమాటను బొబ్బిలి మార్కెట్కు తీసుకెళ్లినా, కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 30 కిలోల కేటు టమాటను కనీసం రూ.30కే కూడా కొనుగోలు చేయకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని అన్నారు.
ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో, పంటను కోయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. కొంతమంది రైతులు పండించిన టమాటను పొలాల్లోనే వదిలేస్తుండగా, అవి అక్కడే కుళ్లిపోతున్నాయి. కష్టపడి పండించిన పంటకు విలువ లేకపోవడం రైతుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జీవనం సాగించడం కష్టంగా మారిందని రైతులు అంటున్నారు. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమలాంటి రైతులకు ఇది పెద్ద దెబ్బగా మారిందని నారాయణరావు తెలిపారు. అప్పులు తీసుకుని పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు వాటిని తీర్చలేని పరిస్థితిలో చిక్కుకున్నారని చెప్పారు.రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ, వెంటనే జోక్యం చేసుకుని టమాటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు. అదేవిధంగా రైతులకు నష్టపరిహారం అందించాలని, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బొబ్బిలి మండలంలో మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పంటకు సరైన ధర లేకపోవడం వల్ల రైతులు వ్యవసాయం చేయడానికే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


