విజయనగరం: బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన 22 నెలల చిన్నారి ధన్షిక అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్లుయెన్సర్ వరల్డ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్‌లలో స్థానం సంపాదించి సంచలనం సృష్టించింది. రెండేళ్లు నిండకముందే మూడు ప్రపంచ రికార్డులు సాధించడం విశేషం.
సిరికి లక్షుంనాయుడు, హారిక దంపతులు తల్లిదండ్రులు. ధన్షిక తన జ్ఞాపకశక్తితో, స్పష్టమైన ఉచ్చారణతో అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షరాలను, వాటికి సంబంధించిన పదాలను, సంఖ్యలను, వారాల పేర్లను, నెలలను, శరీర భాగాలను, జాతీయ చిహ్నాలను, శ్లోకాలను, తెలుగు, ఇంగ్లీష్ రైమ్స్‌ను స్పష్టంగా చెప్పగలదు.
ప్రతిష్టాత్మక సంస్థలు 2026 మార్చిలో ఆమెకు రెండు రికార్డుల గుర్తింపును ప్రదానం చేశాయి. ఐదు నెలల వయసులోనే 120 ఫ్లాష్‌కార్డులను గుర్తించి ‘నోబెల్ వరల్డ్ రికార్డ్’ సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభ కనబరచడం గ్రామంలోని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ధన్షిక ప్రతిభను మరింత అభివృద్ధి చేయడానికి తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు. తండ్రి వరుణ్ మోటార్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణిగా ఉంటూ పూర్తి సహకారం అందిస్తున్నారు.


