Girl Death: తిరుపతిలో విషాదం.. రీల్స్ మోజులో 13 ఏళ్ల బాలిక దుర్మరణం! ఏం జరిగిందంటే |


Last Updated:

తిరుపతి రాజారెడ్డి నగర్‌లో 13 ఏళ్ల పుష్ప రీల్స్ కోసం వీడియో తీయుతూ ఐదవ అంతస్తు నుంచి పడి మృతి, అలిపిరి పోలీసులు దర్యాప్తు, తల్లిదండ్రులకు సోషల్ మీడియా జాగ్రత్తల హెచ్చరిక

తిరుపతి లో రీల్స్ మోజు..13 ఏళ్ల బాలిక మృతి..!
తిరుపతి లో రీల్స్ మోజు..13 ఏళ్ల బాలిక మృతి..!

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతను, చిన్న పిల్లలను పట్టిపీడిస్తున్న ‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కేవలం 13 ఏళ్ల వయసున్న ఒక బాలిక, ఆకర్షణీయమైన వీడియోలు తీయాలనే తపనతో తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డి నగర్‌లో జరిగిన ఈ ప్రమాదం సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

నేపాల్ దేశానికి చెందిన ధను బహదూర్ కుటుంబం గత కొంతకాలంగా ఉపాధి నిమిత్తం తిరుపతిలో నివసిస్తోంది. రాజారెడ్డి నగర్‌లోని మెడిగో హాస్పిటల్ సమీపంలో ఉన్న సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో ధను బహదూర్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు 13 ఏళ్ల కుమార్తె పుష్ప ఉంది. స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసుల కథనం ప్రకారం, పుష్పకు సోషల్ మీడియా అంటే విపరీతమైన పిచ్చి. తరచుగా రకరకాల పాటలకు డ్యాన్స్ చేస్తూ, వినూత్నమైన ప్రదేశాల్లో రీల్స్ రూపొందించి ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో పోస్ట్ చేస్తూ ఉండేది.

ఘటన జరిగిన రోజున పుష్ప ఇంట్లోనే ఉంది. అయితే, కాసేపటి తర్వాత ఆమె కనిపించకపోవడంతో తల్లి కాజల్ ఆందోళనకు గురై అపార్ట్‌మెంట్ అంతా వెతకడం ప్రారంభించింది. చివరకు అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పను చూసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఐదవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో పుష్పకు తీవ్ర గాయాలయ్యాయి. కింద పడిన వేగానికి తలకు, శరీరానికి బలమైన దెబ్బలు తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అలిపిరి ఎస్ఐ శ్రీవాణి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

పుష్ప ఐదవ అంతస్తు బాల్కనీలో లేదా టెర్రస్ పైన నిలబడి మొబైల్‌లో వీడియో తీస్తుండగా ప్రమాదవశాత్తు పట్టుతప్పి కింద పడిపోయిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా సాహసోపేతమైన రీల్స్ తీసే క్రమంలో పిల్లలు పరిసరాలను గమనించకపోవడం ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో పుష్ప ఫోన్ వాడుతోందా? ఆమె చివరిగా షూట్ చేసిన వీడియోలు ఏవైనా ఉన్నాయా? అనే అంశాలను తెలుసుకోవడానికి పోలీసులు ఆమె మొబైల్‌ను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై అలిపిరి పోలీసులు స్పందిస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా అలవాట్లపై నిఘా ఉంచాలని కోరారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత, లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి వీడియోలు తీయడం ఒక వ్యసనంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎత్తైన భవనాలు, రైల్వే ట్రాక్‌లు, నీటి కుంటల వద్ద రీల్స్ తీయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *