Last Updated:
అనకాపల్లి అచ్యుతాపురంలో కురుపాటి రజనీకుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య, భర్త వెంకటనాగ సత్యగోపాలరాజు ఎనిమిది నెలలుగా జైలులో ఉండటం ఒంటరితనం కారణమని పోలీసులు తెలిపారు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉండటం, ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు, ఎస్సై వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్యుతాపురంలోని భోగాపురం రోడ్డులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో కురుపాటి రజనీకుమారి (54) నివాసం ఉంటున్నారు. ఆమె భర్త వెంకటనాగ సత్యగోపాలరాజు ఒక కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విశాఖపట్నం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
గత ఎనిమిది నెలలుగా ఆయన జైలులోనే ఉండటంతో, ఆయనను బయటకు తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోర్టులో బెయిల్ రాకపోవడం, న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడంతో రజనీకుమారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రజనీకుమారి పిల్లలు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భర్త జైలులో ఉండటం, పిల్లలు దూరంగా ఉండటంతో ఆమె గత కొంతకాలంగా ఒంటరితనంతో బాధపడుతున్నారు. తన కళ్ళ ముందే ఎనిమిది నెలలు గడిచినా భర్త ఇంటికి రాకపోవడం, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి ఆమెను కుంగదీశాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
సోమవారం రాత్రి కుమారుడు తన తల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అనుమానం వచ్చిన కుమారుడు వెంటనే అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డుకు ఫోన్ చేసి, ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడాలని కోరారు. సెక్యూరిటీ గార్డు వెళ్లి కిటికీలోంచి చూడగా, రజనీకుమారి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు, బంధువులకు చేరవేశారు.
సమాచారం అందుకున్న అచ్యుతాపురం ఎస్సై వెంకటరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు.. భర్త జైలులో ఉండటం, ఒంటరితనం భరించలేకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒక నిండు ప్రాణం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



