Last Updated:
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న Indigo విమానంలో ఇంజిన్ లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ సురక్షితం.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గగనతలంలో ఉండగానే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో, పైలట్లు వెంటనే అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.
సుమారు 160 మంది ప్రయాణికులతో విశాఖ తీరం నుంచి బయలుదేరిన ఈ విమానం, ఢిల్లీ సమీపానికి చేరుకునే సమయానికి ఇంజిన్‌లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో విమానాశ్రయ అధికారులు వెంటనే ‘ఎమర్జెన్సీ’ ప్రకటించి, రన్‌వే వద్ద అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర వైద్య బృందాలను సిద్ధం చేశారు. పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సాంకేతిక లోపంపై ఇండిగో యాజమాన్యం పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయంలో ఈ అత్యవసర ల్యాండింగ్ కారణంగా కొద్దిసేపు ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విమానాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 28, 2026 12:52 PM IST



