సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఆ విషయంలో శభాష్ చెప్పిన మేనకా గాంధీ!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్స్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గో సంరక్షణ చర్యలను మేనకా గాంధీకి అధికారులు వివరించారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల స్టెరిలైజేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సీఎం రూపొందించిందని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో విశాల ప్రదేశంలో ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మేనకాగాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కృషిని ఆమె ప్రశంసించారు.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసమే టీడీపీ స్థాపన:
తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పడిన గొప్ప వ్యవస్థ అని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ స్థాపన నుండి ఇప్పటివరకు అనేక చారిత్రాత్మక విజయాలను సాధించామని ఆయన గుర్తుచేశారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, సాధారణ కార్యకర్తలు మరియు వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు కల్పించి వారిని శాసనసభలకు తీసుకెళ్లిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. “పేదవారికి అన్నం అందించాలి, వారు గౌరవంగా జీవించాలి” అనే నందమూరి తారకరామారావు సిద్ధాంతాలే పార్టీకి పునాది అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారి రాజకీయ సాధికారతకు తోడ్పడిన పార్టీగా టీడీపీ నిలిచిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ‘మూడు రాజధానుల’ విధానం ఉండదని, ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన అనుభవంతో, అమరావతిని భవిష్యత్తులో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అమరావతి అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే శక్తులను అరికట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.


