Last Updated:
తూర్పుగోదావరి లో పెద్దపులి సంచారం గండి పోచమ్మ ఆలయం పాపికొండలు బోటింగ్ పాయింట్ వద్ద భయాందోళనలు పెంచి ఫారెస్ట్ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా.
తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కనిపించదు.. దాడి మాత్రం ఆపదు అన్న విధంగా.. ఈ పెద్దపులి అడవుల్లో తిరుగుతూ అధికారులు, స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు సమీపంలోనే సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోలనలకు గురవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఒకవైపు, పర్యాటకుల రద్దీ మరోవైపు ఉండటంతో అధికారులు అప్రమత్తంగా మారారు.
ఇటీవల రోజుల్లో పశువులపై దాడులు, దూడలను చంపిన ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం పరిస్థితిని తీవ్రంగా మార్చింది. రెండు రోజుల క్రితం పులిని పట్టుకునేందుకు అటవీశాఖ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రేన్‌పై నుంచి మత్తుమందు ఇవ్వాలనుకున్న సమయంలో యంత్రం శబ్దానికి అప్రమత్తమైన పులి వెంటనే అడవిలోకి పరారైంది. అప్పటి నుంచి అది కనిపించకుండా జాడలు మారుస్తూ అధికారులకు సవాల్ విసురుతోంది.
తాజాగా ఈ పెద్దపులి గండి పోచమ్మ ఆలయం మరియు పాపికొండలు బోటింగ్ పాయింట్ కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అటవీశాఖ గుర్తించింది. గత రాత్రి అదే దిశగా కదిలినట్లు అనుమానించిన అధికారులు, ఉదయం దాని జాడలను నిర్ధారించారు. ప్రస్తుతం ఎండల కారణంగా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఆదివారం కావడంతో వేలాది మంది పర్యాటకులు పాపికొండల బోటింగ్ కోసం చేరుకున్నారు. ఇప్పటికే కొన్ని బోట్లు ప్రయాణం ప్రారంభించగా, మరోవైపు గండి పోచమ్మ అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో పులి సమీపంలోనే ఉండటం అధికారులను అప్రమత్తం చేసింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫారెస్ట్, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు.
ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, నీటిలోకి దిగవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే, కనిపించని పులి భయం పర్యాటక ప్రాంతాలపై మబ్బుల్లా కమ్ముకుంది. అధికారులు ఒకవైపు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చు. ఈ పెద్దపులి ఎప్పుడు పట్టుబడుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


