Wild Animals: అడవిలో ఎన్నిసార్లు వదిలినా తిరిగి ఆ గిరిజనుడి వద్దకే వచ్చేస్తున్న ఎలుగుబంటి పిల్ల.. ఎందుకో తెలుసా? |


Last Updated:

అల్లూరి సీతారామరాజు జిల్లా దొరవలసలో గిరిజనుడు కాపాడిన ఎలుగుబంటి పిల్ల, రంపచోడవరం జింక కథలు జంతువుల అపార విశ్వాసం, మమకారాన్ని చూపించాయి.

ఆఎలుగుబంటికి ఆ గిరిజనుడు అంటే ఎంత ప్రేమో  చూడండి
ఆఎలుగుబంటికి ఆ గిరిజనుడు అంటే ఎంత ప్రేమో  చూడండి

జంతువులకు ఉండే విశ్వాసం, మనుషులపై అవి చూపే అపారమైన ప్రేమ గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం. సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల విశ్వాసం గురించి చర్చించుకుంటాం కానీ, క్రూర మృగాల జాబితాలో ఉండే అడవి జంతువులు సైతం మనుషులతో విడదీయలేని బంధాన్ని పెంచుకుంటాయని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఎలుగుబంటి పిల్ల ఉదంతం, గతంలో రంపచోడవరం పరిధిలో జరిగిన జింక కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ప్రకృతి ఒడిలో నివసించే గిరిజనులకు, అడవి జంతువులకు మధ్య ఉండే సంబంధం చాలా ప్రత్యేకమైనది. వారు అడవిని దైవంగా భావిస్తారు, అందులోని జీవరాశులను తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమిస్తారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపంలోని దొరవలస గ్రామంలో ఒక వింత స్నేహం చిగురించింది. ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల, ఒక గిరిజనుడితో పెంచుకున్న అనుబంధం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కొంతకాలం క్రితం దొరవలసకు చెందిన ఒక గిరిజనుడికి అడవిలో ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల కనిపించింది. దానికి ఆహారం, నీరు అందించి కంటికి రెప్పలా కాపాడాడు. అది కోలుకున్న తర్వాత, అడవి జంతువును ఇంట్లో ఉంచుకోవడం చట్టరీత్యా నేరమని భావించిన ఆయన, దానిని సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి వదిలిపెట్టాడు. కానీ, ఆశ్చర్యకరంగా ఆ ఎలుగుబంటి పిల్ల తనను సాకిన యజమానిని మరచిపోలేకపోయింది. అడవి మార్గాలను దాటుకుంటూ, వాసన పడుతూ మళ్లీ ఆ గిరిజనుడి ఇంటికే చేరుకునేది. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఎన్నోసార్లు అడవిలో వదిలినా, అది తిరిగి తిరిగి తన ‘మిత్రుడి’ దగ్గరికే వచ్చేసేది.

ఈ విషయం సోషల్ మీడియా ద్వారా అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. నిబంధనల ప్రకారం అడవి జంతువులను జనవాసాల్లో ఉంచకూడదు కాబట్టి, అధికారులు దొరవలసకు చేరుకుని ఆ ఎలుగుబంటిని స్వాధీనం చేసుకున్నారు. దానిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం జూ కు తరలించారు. అయితే, అధికారుల బండి ఎక్కుతున్న సమయంలో ఆ ఎలుగుబంటి పిల్ల చేసిన అరుపులు, అది పడ్డ వేదన చూసి స్థానిక గిరిజనులు కన్నీరు పెట్టుకున్నారు. తనను సాకిన వ్యక్తిని విడిచి వెళ్లలేక అది పడ్డ తపన చూస్తుంటే, జంతువులకు ఉండే మమకారం మనుషుల కంటే ఎక్కువే అనిపించింది.

ఇలాంటి ఘటనే మూడు సంవత్సరాల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జరిగింది. ఒక జింక పిల్ల ఒక గిరిజన కుటుంబానికి దగ్గరైంది. వారు దానికి పాలు, ఆహారం ఇచ్చి పెంచారు. ఆ జింక వారి ఇంట్లో ఒక సభ్యురాలిలా తిరిగేది. అటవీ అధికారులు దానిని తీసుకెళ్లి సుదూర అడవుల్లో వదిలిపెట్టినప్పటికీ, అది మళ్లీ ఆ గ్రామానికి వచ్చేసేది. అయితే, ఆ తర్వాత ఆ జింక ఏమైందో ఎవరికీ తెలియకపోవడం ఒక విషాదం.

సాధారణంగా అడవి జంతువులు మనుషులను చూస్తే భయపడతాయి లేదా దాడి చేస్తాయి. కానీ, ప్రేమగా ఆహారం పెట్టి ఆదరిస్తే, అవి తమ క్రూర స్వభావాన్ని వీడి మచ్చికవుతాయి. అరకు ఎలుగుబంటి పిల్ల ద్వారా వన్యప్రాణుల విశ్వాసం మరోసారి ప్రపంచానికి తెలిసింది. చట్టం తన పని తాను చేసుకుపోయినా, ఆ గిరిజనుడికి, ఆ ఎలుగుబంటికి మధ్య ఉన్న అదృశ్య బంధం మాత్రం అందరి హృదయాలను కదిలించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *