మత్తు బారిన పడిన జీవితాలకు ఆశాకిరణం.. ఆ జిల్లాలో ఉచిత డీ-అడిక్షన్ కేంద్రం..! Vizianagaram Seed organization de addiction center is lighting up lives. |


Last Updated:

విజయనగరం లోని Seed Organization మత్తు విముక్తి కేంద్రం లో నెలరోజుల ఉచిత చికిత్స, కౌన్సిలింగ్ తో అనేక మందికి కొత్త జీవితం అందిస్తోంది.

+

మత్తు

మత్తు బారిన పడిన వారికి ఉచిత చికిత్స ఎక్కడో తెలుసా

మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని చీకటిలోకి నెట్టేసుకున్న వారికి ఇప్పుడు ఒక వెలుగుదారి కనిపిస్తోంది. విజయనగరం పట్టణంలో సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మత్తు విముక్తి కేంద్రం అనేక మందికి ఆశాకిరణంగా మారింది. మద్యపానం, గంజాయి, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లకు బానిసలైన వారికి పూర్తిగా ఉచితంగా నెలరోజులపాటు చికిత్స అందిస్తూ వారి జీవితాలను మళ్లీ సక్రమ దారిలోకి తీసుకువస్తోంది.

ఈ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరిని ముందుగా పూర్తిస్థాయి అంచనాతో పరిశీలిస్తారు. వారి వ్యసనం ఎంత తీవ్రమైందో, ఏ మత్తు పదార్థాలకు అలవాటు పడారో, ఒక్కటేనా లేక అనేక పదార్థాలపై ఆధారపడుతున్నారో సవివరంగా విశ్లేషిస్తారు. అలాగే వారి వైద్య చరిత్ర, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ వివరాల ఆధారంగా తదుపరి వైద్య పరీక్షలకు పంపిస్తారు.

ముఖ్యంగా మద్యపానానికి బానిసలైన వారిలో లివర్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశముండటంతో లివర్ ఫంక్షన్ టెస్టులు, రక్తంలో షుగర్ స్థాయిలు, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నివేదికల ఆధారంగా పేషెంట్ ఆరోగ్య స్థితిని అంచనా వేసి చికిత్స ప్రారంభమవుతుంది. చికిత్సను రెండు ప్రధాన దశల్లో అమలు చేస్తారు. మొదటి దశలో పేషెంట్‌ను శారీరకంగా స్థిరపరచడం ప్రధాన లక్ష్యం. అడ్మిట్ అయిన తొలి ఐదు నుంచి ఏడు రోజుల్లో మందులు, ఇంజెక్షన్ల ద్వారా శరీరంలో మత్తు పదార్థాల ప్రభావాన్ని తగ్గించి, వచ్చే ఉపద్రవాలను నియంత్రిస్తారు. ఈ దశ పూర్తయ్యేసరికి పేషెంట్ శారీరకంగా కొంతమేర కోలుకుంటాడు.

తర్వాతి దశలో అసలు మార్పు ప్రారంభమవుతుంది. మళ్లీ మత్తు వైపు వెళ్లకుండా మానసికంగా బలపరచడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇందుకోసం వ్యక్తిగత కౌన్సిలింగ్, కుటుంబ కౌన్సిలింగ్, గ్రూప్ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారి ఆలోచనా విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడంతో పాటు, మత్తుపై ఉన్న ఆకర్షణను తగ్గించేలా మార్గనిర్దేశం చేస్తారు. ఈ ప్రక్రియ సుమారు మూడు వారాల పాటు కొనసాగుతుంది.

మొత్తం చికిత్స కాలంలో పేషెంట్లకు ఆహారం, నివాసం, వైద్యం అన్నీ ఉచితంగా అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత. చికిత్స పూర్తయ్యాక కూడా వారిని వదిలేయకుండా ఫాలోఅప్ చేస్తూ, తిరిగి వ్యసనానికి గురికాకుండా పర్యవేక్షణ కొనసాగిస్తారు. ప్రతిరోజూ సిబ్బంది అందుబాటులో ఉండి పేషెంట్లకు అవసరమైన సేవలు అందిస్తుండటంతో, ఇప్పటికే అనేక మంది తమ జీవితాలను కొత్తగా ప్రారంభించగలిగారు. మత్తు బారిన పడిన వారు వెనుకాడకుండా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవితాన్ని నాశనం చేసే వ్యసనాల నుంచి బయటపడటానికి ఇది నిజంగా ఒక కొత్త ఆరంభం అవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *