Last Updated:
విజయనగరంలో మట్లఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనలు చేశారు.
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన Palm Sunday వేడుకలు విజయనగరం పట్టణంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈస్టర్ పండుగకు నాంది పలికే ఈ మట్లఆదివారం రోజున చర్చిలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. Jesus Christ యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఉదయం నుంచే భక్తులు చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకుని “హోసన్నా” అంటూ జయధ్వానాలు చేస్తూ చర్చిల వైపు తరలివచ్చారు. పట్టణంలోని ఆర్.సి.యం చర్చి సహా వివిధ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక మస్సులు నిర్వహించి యేసుక్రీస్తును తమ రాజుగా స్వాగతించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులు భక్తి పరవశాన్ని కలిగించాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ విశ్వాసాన్ని చాటుకున్నారు.
బైబిల్ ప్రకారం, యేసుక్రీస్తు గాడిదపై యెరూషలేము నగరంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు తమ వస్త్రాలను నేలపై పరచి, ఖర్జూర ఆకులతో ఆయనకు ఘన స్వాగతం పలికారని ఫాదర్ వివరించారు. “హోసన్నా” అంటూ కీర్తనలు పాడుతూ యేసును రాజుగా ఆహ్వానించడం, ఆయన వినయం, ప్రేమకు ప్రతీకగా ఈ రోజును భావిస్తారని తెలిపారు. ఈ ఘట్టం క్రైస్తవ విశ్వాసంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని చెప్పారు.
మట్లఆదివారం తో ప్రారంభమయ్యే పవిత్ర వారాన్ని ‘హోలీ వీక్’గా పిలుస్తారు. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక దినాలు వరుసగా కొనసాగుతాయి. Good Friday రోజున యేసుక్రీస్తు శిలువ వేయబడిన దుఃఖ ఘట్టాన్ని స్మరించుకుంటారు. ఈ రోజు చర్చిల్లో నిశ్శబ్ద ప్రార్థనలు, శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహించి యేసు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటారు.
దీనికి కొనసాగింపుగా వచ్చే ఆదివారం Easter పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. యేసుక్రీస్తు మరణం తర్వాత మూడో రోజు పునరుత్థానం చెందినట్లు విశ్వసించే ఈ పండుగ క్రైస్తవులకు ఆశ, విశ్వాసం, కొత్త జీవితం అనే భావనలను అందిస్తుంది. ఈ సందర్భంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించి భక్తులు ఆనందాన్ని పంచుకుంటారు.
మట్ల ఆదివారం సందర్భంగా ఫాదర్ ఆంద్రేయ మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సేవా భావాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌహార్ద్రం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర వేడుకలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా, పరస్పర ప్రేమ, ఐక్యతకు సంకేతంగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


