Live News: అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్-5కు సవరణ కోసం తీర్మానం చేసింది. ఈ సవరణ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఐదున్నర గంటలపాటు అసెంబ్లీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు.
తెలంగాణ అసెంబ్లీ వాయిదా:
తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఆసక్తికర చర్చలతో కొనసాగాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ ఈరోజుతో ముగిసింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మరియు లేవనెత్తిన అంశాలకు సంబంధించి మంత్రులు వివరణలు ఇచ్చారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ శాఖల బడ్జెట్ కేటాయింపులపై అధికార మరియు ప్రతిపక్ష సభ్యులు విస్తృతంగా చర్చించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధుల వినియోగంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
బడ్జెట్ పద్దులపై చర్చ ముగిసిన వెంటనే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం, రేపు సభలో అప్రోప్రియేషన్ బిల్లు (Appropriation Bill)పై చర్చ జరగనుంది.
ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం: మంత్రి నారా లోకేశ్
అప్పుడు అభివృద్ధి చేశాం కాబట్టే దేశంలో అనంతపురం ఐదో స్థానానికి చేరుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన 2014–19 మధ్యకాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేశారు.
ఒకప్పుడు అనంతపురం చాలా వెనుకబడి ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కియా పరిశ్రమను తీసుకువచ్చామని చెప్పారు. కియా కంపెనీ రావడంతో అనంతపురం ప్రస్తుతం అభివృద్ధిలో ఐదో స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ ద్వారా అభివృద్ధి చేసామని వివరించారు.
ఉత్తరాంధ్రకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కంపెనీలను తీసుకువచ్చారని గుర్తుచేశారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని వైఎస్ జగన్ చెప్పలేదా అని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటు వల్ల అనేక మంది జీవితాల్లో మార్పులు వచ్చాయని, అమరావతి రాజధానిగా నిర్ణయించడం వల్ల అక్కడి భూముల ధరలు పెరిగాయని తెలిపారు.
ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.. దయ చేసి విపక్షాలు దుష్ప్రచారం చేయొద్దు: పీఎం మోదీ
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో చమురు, ఇంధనం, ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని, వచ్చే 60 రోజుల వరకు ఎలాంటి కొరత ఉండదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయినప్పటికీ భవిష్యత్తు పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విపక్షాలు రాజకీయ లాభం కోసం పరిస్థితిని ఉపయోగించుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
శనివారం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ దృఢంగా నిలబడిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో మౌలిక వసతులను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు మౌలిక వసతుల అభివృద్ధికి రూ.17 లక్షల కోట్లను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా దేశంలోని రైల్వే మార్గాల్లో 40 వేల కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ పూర్తి చేసినట్టు వివరించారు.


