యువతకు గుడ్ న్యూస్.. అనకాపల్లిలో లక్ష జాబ్స్.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన..! Arcelor Mittal Nippon Steel foundation in Nakkapalli one lakh jobs. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపనతో అనకాపల్లి స్టీల్ సిటీగా, లక్ష ఉద్యోగాలు, భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ కొత్త పారిశ్రామిక దశలోకి.

ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి మరో భారీ మైలురాయి చేరింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఈ భారీ ప్రాజెక్టును సాకారం చేసి చూపించామని పేర్కొన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌లను ఆయన అభినందించారు. అలాగే పరిశ్రమ కోసం భూమి ఇచ్చిన రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ భారీ ఉక్కు పరిశ్రమ ద్వారా మొత్తం 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని సీఎం వివరించారు. అనకాపల్లిలో కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, పూర్తిస్థాయి “స్టీల్ సిటీ” అభివృద్ధికి కూడా ఇది శ్రీకారం అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు ₹11,198 కోట్ల వ్యయంతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కూడా చేపడుతున్నారు.

2028 నాటికి ప్లాంట్‌లో తొలి దశ ఉత్పత్తి ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించామని, 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నెస్, అదే సంవత్సరం డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. జాతీయ రహదారితో అనుసంధానంగా నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, ముడి ఇనుము సరఫరా కోసం పైప్‌లైన్ ఏర్పాటు కూడా జరుగనున్నాయని చెప్పారు.

ఈ పరిశ్రమతో కేవలం ఉక్కు ఉత్పత్తి మాత్రమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులు ఇచ్చిన రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనని, పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని ఆయన తెలిపారు.

టూరిజం నుంచి డేటా సెంటర్ల వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకు అన్ని రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, బీపీసీఎల్ వంటి భారీ పరిశ్రమల రాక, 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి రావడం దేశంలోనే మొదటిసారి అని పేర్కొన్నారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యాన్ని సాధిస్తామని సీఎం వెల్లడించారు. గత 20 నెలల్లో రాష్ట్రానికి రూ. 20.35 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను నాలెడ్జ్ ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రను రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ప్రాజెక్ట్ ద్వారా అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ మెగా ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కొత్త దశలోకి అడుగుపెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *