Last Updated:
CM Chandrababu: రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఈ భారీ పరిశ్రమను కేవలం 20 నెలల్లోనే సాకారం చేసి చూపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేశ్‌ను ఆయన అభినందించారు.
CM Chandrababu: రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఈ భారీ పరిశ్రమను కేవలం 20 నెలల్లోనే సాకారం చేసి చూపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేశ్‌ను ఆయన అభినందించారు. ఉక్కు పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అనకాపల్లిలోని ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ పరిశ్రమకు కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.
రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా మొత్తం 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. అనకాపల్లిలో కేవలం స్టీల్ ప్లాంట్‌కే కాకుండా ఒక స్టీల్ సిటీకి శంకుస్థాపన జరిగినట్లుగా చెప్పారు. ఈ ప్రాజెక్టుతో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరగనుందని తెలిపారు. 2028 నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నెస్, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే జాతీయ రహదారికి అనుసంధానంగా 4 లేన్ల రహదారి, ముడి ఇనుము సరఫరాకు పైప్‌లైన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఉక్కు ఉత్పత్తి మాత్రమే కాకుండా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల ద్వారా ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంత వేగంగా పరిశ్రమకు భూసేకరణ, అనుమతులు ఇవ్వడం దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యమైందని హర్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా అభివర్ణించిన సీఎం, పరిశ్రమల అనుకూల ప్రభుత్వం, నైపుణ్యవంతమైన మానవ వనరులు రాష్ట్రానికి ఉన్నాయని తెలిపారు. టూరిజం నుంచి డేటా సెంటర్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకు అన్నింటికీ రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యాన్ని సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని, ఇది సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తుందని పేర్కొన్నారు. బీపీసీఎల్ సహా పెద్ద పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20.35 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.
విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ, పోర్టులు వంటి కీలక రంగాల్లో హబ్‌గా మార్చనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ప్రాజెక్ట్ ద్వారా అందిస్తామన్నారు. కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టులు కూడా త్వరలో రానున్నాయని.. మూలపేట పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆర్సెలార్ మిట్టల్–నిప్పాన్ స్టీల్ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రైతులు చేసిన త్యాగాన్ని గుర్తుచేసి వారికి తగిన సహాయం అందించాలని సూచించారు. ఉక్కు పరిశ్రమ కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా అనకాపల్లి జిల్లా యువతకే ఈ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మెటలర్జీ రంగంలో ఆవిష్కరణలకు ఇది ముఖ్యమైన కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



