Last Updated:
CM Chandrababu: అభివృద్ధి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించడానికి సరిపోదని, అయితే సమాజంలో అసలైన మార్పుకు సాంకేతికతే ప్రధాన ఆధారమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదికగా జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
CM Chandrababu: అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌ను మించేలా అమరావతిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదికగా జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ఏఐ వినియోగం, డేటా భద్రత, భవిష్యత్ టెక్నాలజీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించడానికి సరిపోదని, అయితే సమాజంలో అసలైన మార్పుకు సాంకేతికతే ప్రధాన ఆధారమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముప్పై ఏళ్ల కిందటే ఐటీ రంగంపై దృష్టి పెట్టామని, ప్రస్తుతం ప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ దిశగా వేగంగా ముందుకెళ్తోందని చెప్పారు. డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్‌ల వినియోగం పెరుగుతుండగా, ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. డేటా సెంటర్లు, సరైన విధానాల రూపకల్పనతో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెడతామని తెలిపారు. 1990 దాటాక మనవద్ద ఇంటర్నెట్ ప్రారంభమైందని చెప్పారు. ఆతర్వాత 1995 నుంచి నాలెడ్జ్ ఎకానమీ మొదలైందని గుర్తు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధిలో మా పాత్ర:
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో తమ కృషి ఎంతో ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఐఎస్‌బీని హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించామని, శంషాబాద్ విమానాశ్రయం కోసం వేల ఎకరాల భూమిని సేకరించామని చెప్పారు. నల్సార్, ట్రిపుల్ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలను కూడా తామే స్థాపించామని వివరించారు. కేవలం తొమ్మిది నెలల్లో కృష్ణా నది నీటిని హైదరాబాద్‌కు అందించి తాగునీటి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ గుర్తింపు:
హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలను చంద్రబాబు గుర్తుచేశారు. బిల్ గేట్స్‌ను స్వయంగా కలసి భారతీయుల ప్రతిభను వివరించి, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటు చేయించామని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆహ్వానం లేకుండానే హైదరాబాద్‌ను సందర్శించారని, ఆయన సూచనతో టోనీ బ్లెయిర్ కూడా నగరాన్ని సందర్శించారని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా హైటెక్ సిటీ ప్రారంభమైందని గుర్తు చేశారు.
గ్రీన్ ఎనర్జీలో ఏపీ దూసుకెళ్తోంది:
విద్యుత్ కొరత నుంచి మిగులు విద్యుత్ సాధించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, దక్షిణ భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 2014–19 మధ్య అనేక సంస్కరణలు చేపట్టామని, ఇప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



