Last Updated:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమలో CI టీవీ నరేష్ కుమార్ రాజోలు ప్రాంతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవా కార్యక్రమాలు చేసి పాసర్లపూడి లంక బాధితులకు అండగా నిలిచారు.
సాధారణంగా ‘పోలీసు’ అనగానే మనకు గుర్తొచ్చేది కాస్త గంభీరమైన ముఖం, కఠినమైన మాటలు, చేతిలో లాఠీ. ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి సామాన్యులు ఇప్పటికీ సంకోచిస్తుంటారు. “అక్కడికి వెళ్తే మనల్ని విచారిస్తారేమో, అనవసరమైన చిక్కులు వస్తాయేమో” అనే భయం ప్రజల్లో గూడుకట్టుకుని ఉంటుంది. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే యంత్రాలనీ, వారికి జాలి, దయ ఉండవని చాలామంది నమ్ముతుంటారు. కానీ, ఆ కాకి డ్రెస్ వెనుక స్పందించే హృదయం ఉంటుందని, యూనిఫామ్ ధరించిన వ్యక్తి తోటి మనిషి కష్టాన్ని చూసి చలించిపోతాడని నిరూపిస్తున్నారు ఒక పోలీస్ అధికారి. ఆయనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) టీవీ నరేష్ కుమార్.
రాజోలు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణలో సిఐ నరేష్ కుమార్ తనదైన ముద్ర వేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల ఎంత కఠినంగా ఉంటారో, ఆపదలో ఉన్న సామాన్యుల పట్ల అంతటి కనికరాన్ని ప్రదర్శిస్తారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే కేవలం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని ఆయన నమ్ముతారు. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆయన్ని కేవలం ఒక అధికారిగా మాత్రమే కాకుండా, ఒక ఆపద్బాంధవుడిగా చూస్తుండటం విశేషం.
రోడ్డు ప్రమాదాల నివారణలో నరేష్ కుమార్ తీసుకుంటున్న చర్యలు అద్భుతమని స్థానికులు కొనియాడుతుంటారు. సాధారణంగా హెల్మెట్ లేకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ, ఈ సిఐ గారు ఒక అడుగు ముందుకు వేసి, హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ తన సొంత ఖర్చులతో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసిన సందర్భాలు అనేకం. “చట్టం ప్రకారం శిక్షించడం నా బాధ్యత అయితే, మీ ప్రాణాలను కాపాడటం నా మానవత్వం” అనే సందేశాన్ని ఆయన చాటిచెబుతున్నారు.
సిఐ నరేష్ కుమార్ చేసే సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఆయన చేసే ఏ సాయం ప్రచారం కోసం చేయరు. ఎక్కడైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే, స్వయంగా వెళ్లి పరామర్శించడమే కాకుండా, తన సిబ్బంది ద్వారా రహస్యంగా ఆర్థిక సహాయం అందజేస్తుంటారు. రాజోలు ప్రజల మాటల్లో చెప్పాలంటే, “ఆయన చేసే సహాయం ఎవరికీ తెలియదు, కానీ పొందే వారికి ఆ సంతోషం తెలుస్తుంది”.
ఇటీవల పాసర్లపూడి నుంచి ఆదురు బౌద్ధ స్తూపం వరకు జరుగుతున్న రహదారి పనుల్లో భాగంగా, పాసర్లపూడి లంక ఏటిగట్టుపై నివసిస్తున్న ఐదు ఇళ్లను తొలగించాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు. ఇళ్లు కోల్పోతున్న ఆ కుటుంబాల రోదనను చూసిన నరేష్ కుమార్ మనసు ద్రవించింది. వెంటనే ఆయన తన సిబ్బందిని పంపి, ఆ బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. “మేము ఉన్నాము, అధైర్యపడకండి” అంటూ వారికి ధైర్యాన్ని నూరిపోశారు. ఈ ఘటన బయటకు రావడంతో రాజోలు వాసులు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
పోలీసు డ్యూటీలో భాగంగా ధరించే నల్ల కళ్లజోడు కేవలం గంభీరత కోసం మాత్రమే కాదు, ఆ కళ్లజోడు వెనుక సమాజం పట్ల బాధ్యత, పేదల పట్ల కరుణ ఉన్నాయని నరేష్ కుమార్ నిరూపించారు. విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా నేరాలను అరికట్టడం. కులమతాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ తనవంతు సాయం అందించడం ఆయన నైజం.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


