విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. 2026 ఏప్రిల్ 1 నుంచి ఫుల్ ఆపరేషన్స్..! Center reveals South Coast Railway Zone. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం కేంద్రంగా SCoR జోన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం. ముడసర్లోవలో 12 అంతస్తుల హెడ్ ఆఫీస్ నిర్మాణం, 15 వేలకుపైగా ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలం.

విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం
విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌కు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ ఏర్పాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. 2026 ఏప్రిల్ 1 నాటికి ఈ జోన్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో ప్రకటించడంతో రాష్ట్రంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ ప్రకటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన గుర్తుచేస్తూ, 2019 ఫిబ్రవరి 17న విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అదే నెల 28న కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌కు ఆమోదం తెలిపిందని వివరించారు. అనంతరం 2025 జనవరి 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముడసర్లోవలో శాశ్వత ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయడం ఈ ప్రాజెక్టుకు మైలురాయిగా నిలిచిందన్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.183 కోట్లకు పైగా ఉందని తెలిపారు.

విశాఖపట్నంలోని ముడసర్లోవలో 52.2 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర తీరాన్ని ప్రతిబింబించేలా క్రూయిజ్ ఆకారంలో ఆధునిక సదుపాయాలతో 12 అంతస్తుల ప్రధాన కార్యాలయ భవనం నిర్మాణం కొనసాగుతోంది. దీనికి సుమారు రూ.107 కోట్లు ఖర్చు అవుతుండగా, శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విఎంఆర్‌డిఏ ఐకానిక్ “ది డెక్” భవనం నుంచి తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మాధవ్ తెలిపారు.

ఈ కొత్త రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం డివిజన్ (పాత వాల్తేర్ డివిజన్ నుంచి విడదీసినది), విజయవాడ, గుంటూరు, గుంటకల్ డివిజన్లు ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ జోన్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కొన్ని ప్రాంతాలను కూడా కలుపుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ జోన్ ద్వారా నిర్వహించబడనున్నాయి.

భూసేకరణ వంటి సమస్యల వల్ల కొంతకాలం ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతోంది. జనరల్ మేనేజర్ నియామకం పూర్తయ్యి నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ జోన్ ప్రారంభంతో రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడటంతో పాటు కొత్త రైళ్ల మంజూరు, ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ వంటి పనులు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా 15 వేలకుపైగా ఉద్యోగావకాశాలు కలుగనున్నాయని అంచనా. పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేస్తూ, విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *