Last Updated:
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని India Meteorological Departmentకి చెందిన విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు నమోదవుతున్నాయని తెలిపారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కృష్ణా, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కాకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే ఎక్కువగా పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే రెండు నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు మన్యం, పోలవరం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడతాయని అంచనా వేస్తున్నారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పంటలు దెబ్బతిన్నాయి. గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండటంతో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మినుము, మిరప, పసుపు, అరటి, మొక్కజొన్న వంటి పంటలను రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరబెట్టిన ధాన్యాలు, ఇతర పంటలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు.
మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నప్పటికీ, అప్పటివరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


