Last Updated:
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు. కాకినాడలో ఐదు రకాల బస్సులు ఉచితం. 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే అర్హత.
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో కలెక్టర్లతో పాటు, ఎమ్మెల్యేలు సైతం బస్సులో ప్రయాణం చేస్తూ ప్రారంభించారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం బస్సులో ప్రయాణం చేస్తూ ఈ దివ్యాంగుల ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు.
అయితే మహిళా శక్తి దివ్యాంగ శక్తి కి గల తేడా ఏంటి? ఎన్నిరకాల బస్సులు వీరికి ఉచితంగా ఇస్తున్నారు? ఎంత శాతం వికలాంగులకు ఈ బస్సులు ఫ్రీ అన్నది కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు సైతం వివరించారు. ఒకసారి ఆ వివరాలు క్లుప్తంగా చూద్దాం.
దివ్యాంగ శక్తిపేరుతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. అయితే కాకినాడకు సంబంధించి విధివిధానాల వివరిస్తూ జిల్లాలో కాకినాడ, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, తుని ప్రాంతాలలో ఎమ్మెల్యేలు అధికారులు సంయుక్తంగా ఈ బస్సులను ప్రారంభించారు
ఈ ఆర్టీసీ బస్సులు ఎక్కే దివ్యాంగులు 40 శాతంకు పైగా వైకల్యం కలిగిన వారు మాత్రమే అర్హులుగా చెప్పుకొచ్చారు. వారితో పాటు వచ్చే సహాయకులకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరికి సంబంధించి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఈ ఐదుబస్సులు పూర్తిగా వీరికి ఉచితంగా స్పష్టం చేశారు..
అదేవిధంగా ఏసీ, డీలక్స్ వంటి బస్సుల్లో ప్రయాణం చేస్తే 50% మాత్రమే వికలాంగులకు రాయితీ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఏదేమైనా ప్రస్తుతం ఐదు బస్సులు వీరికి పూర్తిగా ఉచితం అని తెలియజేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బస్సులో ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం ఎప్పుడూ కోరుతుందని గతంలో ఎన్నడూ లేనివిధంగా 21 రకాల అంగవైకల్యాలున్న వారందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తుందని స్పష్టం చేశారు. దివ్యాంగుల సంఘం కాకినాడ అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ దివ్యాంగులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రకంగా ఉచిత బస్సు అందించడం ఎంతో ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


