గ్యాస్ కొరత పేరుతో దళారీల దందా.. సిలిండర్ కోసం సామాన్యుల పోరాటం.. ఏపీలో గ్యాస్ సంక్షోభం తీవ్రం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య తీవ్రమవుతోంది. గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్, అక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

+

గ్యాస్

గ్యాస్ పక్కదోవ పట్టడానికి వీరే కారణం.. ఏపీలో తీవ్రమైన గ్యాస్ సమస్య

ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఒకప్పుడు సులభంగా లభించిన గ్యాస్ ఇప్పుడు సాధారణ ప్రజలకే కాదు, చిన్న వ్యాపారులకూ అందని ద్రాక్షలా మారుతోంది. ఇళ్లలోనూ, హోటళ్లలోనూ, రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాలు చేసే వారికీ.. ఇలా అందరూ గ్యాస్ దొరకక ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ.. నేలమీద పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.

ముఖ్యంగా రోడ్డు పక్కన చపాతీలు, టిఫిన్లు అమ్ముకునే చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా రూ.900 నుంచి రూ.1000 వరకు ఉండే గ్యాస్ సిలిండర్, ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో రూ.1800 వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తాము ఇంత ఖర్చు పెట్టి తెస్తున్నాం.. అందుకే ధర పెంచాల్సి వస్తోందని వ్యాపారులు.. వినియోగదారులపై భారం మోపాల్సి వస్తోంది. దీంతో సాధారణ ప్రజల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితిని కొంతమంది మధ్యవర్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ దొరకదన్న భయాన్ని పెంచి, సిలిండర్లను దాచిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా లేకపోవడం, డెలివరీలో ఆలస్యం జరగడం ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. దీంతో ప్రజలు ముందుగానే బుకింగ్‌లు చేయడం పెరగడంతో, డిమాండ్ మరింతగా పెరిగింది.

గ్యాస్ డెలివరీ బాయ్స్ పాత్ర కూడా ఈ పరిస్థితిలో కీలకంగా మారింది. కొందరు డెలివరీ సిబ్బంది, ఇళ్లలో అదనంగా ఉన్న సిలిండర్లను సేకరించి వ్యాపారులకు అందిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది పనితీరుపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

గ్యాస్ కొరత ప్రభావం ఆలయాలపైనా పడింది. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో వంటగ్యాస్ అందకపోవడంతో, ప్రత్యామ్నాయంగా కట్టెలు, ఇతర వనరులతో వంటలు చేయాల్సి వస్తోంది. నెలకు డజన్ల కొద్దీ సిలిండర్లు అవసరమయ్యే ఆలయాలు కూడా ఇప్పుడు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రసాదాల తయారీ, అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రభావితమవుతున్నాయి.

మొత్తానికి గ్యాస్ కొరత పేరుతో ఏపీలో దళారీ వ్యవస్థ పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. గ్యాస్ దొరకదన్న ప్రచారం, సరఫరాలో జాప్యం, మధ్యవర్తుల అక్రమాలు ఇలా అందరూ కలిసి సాధారణ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. వెంటనే అధికారులు కఠిన చర్యలు తీసుకుని, సరఫరా వ్యవస్థను సరిచేయకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *