Last Updated:
జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ తెలిపారు. 129 కేంద్రాలు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. 23,095 మంది విద్యార్థులు హాజరవుతారు.
జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రాజేంద్రప్రసాద్ లోకల్ 18 ద్వారా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ఎక్కడైనా కాపీయింగ్ జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 129 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో ఎ కేటగిరీ 44, బి కేటగిరీ 41, సి కేటగిరీ 43 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో మొత్తం 23,095 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 12,105 మంది అబ్బాయిలు, 10,990 మంది అమ్మాయిలు ఉన్నారని తెలిపారు. అదనంగా 19 పరీక్షా కేంద్రాల్లో 1,063 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు.
పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులను ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు జిల్లా వ్యాప్తంగా 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనంగా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 129 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 129 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 12,010 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్లు చెప్పారు.
ట్రెజరీ లేదా పోలీస్ స్టేషన్ లేని 43 పరీక్షా కేంద్రాలకు ఎంఈఓలు లేదా సీనియర్ హెడ్‌మాస్టర్లు ఉదయం ప్రశ్నాపత్రాలను తీసుకెళ్లి, పరీక్ష అనంతరం ఆన్సర్ పత్రాలను స్ట్రాంగ్ రూములకు తిరిగి తరలించే విధంగా ప్రత్యేక విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన 12 పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి కఠిన పర్యవేక్షణ చేపడుతున్నట్లు చెప్పారు. ఈసారి విద్యార్థుల హాల్ టికెట్లలో క్యూఆర్ కోడ్ ముద్రించడం ద్వారా సాంకేతిక సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
హాల్ టికెట్‌ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం చిరునామా సహా పూర్తి వివరాలు తెలుసుకునే వీలుంటుందని వివరించారు. అలాగే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతల కోసం సెక్షన్ 144 అమలు చేస్తామని డీఈఓ తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలల్లో ఉదయం తరగతులకు సెలవులు ప్రకటించి, పరీక్షలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మాస్ కాపీయింగ్ చేయిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 15, 2026 10:56 AM IST



