Last Updated:
ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై ఈ ధరల పెంపు పెను భారంగా మారనుంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి.
Cylinder Rates: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావం నేరుగా దేశీయ వంట గ్యాస్ ధరలపై పడింది. చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మధ్యతరగతి, పేద ప్రజలు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై ఈ ధరల పెంపు పెను భారంగా మారనుంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి.
ఈనాడు కథనం ప్రకారం.. ఒక్కో సిలిండర్‌పై రూ. 60 మేర ధర పెరిగింది. గతంలో రూ. 877.5 ఉన్న ధర ఇప్పుడు రూ. 937.5కి చేరుకుంది. హోటళ్లు, వ్యాపార సంస్థలు వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ. 115 పెరిగింది. దీంతో దీని ధర రూ. 1849 నుండి ఏకంగా రూ. 1964కి పెరిగింది. పెరిగిన ధరలకే కాకుండా, గ్యాస్ సిలిండర్లను ఇంటికి చేరవేసే డెలివరీ బాయ్స్ తీసుకునే కమిషన్‌తో కలిపితే వినియోగదారుడి జేబుకు మరింత చిల్లు పడనుంది.
ధరల పెంపు ప్రభావం ఉమ్మడి జిల్లాలో గణనీయంగా ఉండబోతోంది. ఇక్కడ మొత్తం 11.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగదారులు సుమారు 10 లక్షల మంది వరకు ఉండగా, వీరంతా ఏడాదికి సగటున 8 సిలిండర్లు వాడుతారని అంచనా. ఈ లెక్కన జిల్లాలోని గృహ వినియోగదారులపై ఏడాదికి రూ. 48 కోట్ల అదనపు భారం పడనుంది. జిల్లాలో 1.14 లక్షల మంది వాణిజ్య వినియోగదారులు ఉన్నారు. వీరిపై ఏడాదికి రూ. 19.67 కోట్ల భారం పడనుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా ప్రజలపై రూ. 67.67 కోట్ల అదనపు భారం పడుతోంది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల హోటళ్లు, క్యాంటీన్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. సామాన్యుడు హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న మూడు సిలిండర్ల రాయితీ పాత ధరల ప్రకారం ఇస్తుందా లేక పెరిగిన ధరలకు అనుగుణంగా ఇస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుంటే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లా మారింది. యుద్ధ మేఘాలు తొలగి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే తప్ప సామాన్యుడి వంటింట్లో ఈ మంట తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి గ్యాస్ ధరలపై నియంత్రణ సాధించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



