Last Updated:
మహిళా దినోత్సవం రోజున ఏపీలో మల్లాడి రాజు కుమార్తెలు విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. తండ్రి రెండో పెళ్లి, తల్లి ఆత్మహత్య, తమ పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జోక్యం కోరారు.
మహిళా దినోత్సవం రోజున ఏపీలో ఇద్దరు యువతులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తమ కుటుంబంలో జరిగిన సంఘటనలను కన్నీటి స్వరంతో వివరించిన ఆ యువతులు తమ తండ్రినే ప్రశ్నిస్తూ చేసిన ఆవేదనాత్మక వ్యాఖ్యలు పలువురిని కదిలించాయి. డాడీ.. నీకు మా పరిస్థితి అర్థం అవుతుందా? అమ్మను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నావు. మమ్మల్ని చూసేందుకు వారానికి ఒక్కసారి అయినా రావాలనిపించలేదా? అంటూ ఆ ఇద్దరు సోదరీమణులు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఏపీకి చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి చెందిన నాయకుడు మల్లాడి రాజు కుమార్తెలుగా గుర్తించిన ఇద్దరు యువతులు ఈ వీడియోను విడుదల చేశారు. వారి చెప్పిన వివరాల ప్రకారం, మల్లాడి రాజు వివాహం తర్వాత ఇద్దరు కుమార్తెలు జన్మించారు. దాదాపు ఏడు సంవత్సరాలు కుటుంబ జీవితం కొనసాగిన తర్వాత, తనకు చెందిన ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేసే ఒక మహిళను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని కుమార్తెలు ఆరోపిస్తున్నారు.
ఆ ఘటన తర్వాత తమ తల్లి తీవ్రంగా మానసికంగా కుంగిపోయిందని, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయాలు తిరిగినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తట్టుకోలేక చివరకు తమ తల్లి ఆత్మహత్య చేసుకుందని ఇద్దరు యువతులు కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ అన్ని కష్టాలు భరించి మమ్మల్ని పెంచింది. చివరికి బాధను తట్టుకోలేక దేవుడిలో కలిసిపోయింది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లి మరణం తర్వాత తాము ఇద్దరం మాత్రమే మిగిలిపోయామని, ఈ సమయంలో తమ తండ్రి నుంచి ఎలాంటి ఆదరణ లేదని యువతులు చెబుతున్నారు. ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు తమ తండ్రి పేరున ఉన్నప్పటికీ తాము బలవంతంగా కబ్జా చేశామని ఆరోపిస్తూ కొందరిని పంపించి తమపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. తమకు అండగా నిలుస్తున్న అమ్మమ్మ, మావయ్యలపై కూడా కేసులు వేయిస్తున్నారని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో తాము పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయామని, తమ బాధను ఎవరైనా వినాలని భావించి ఈ వీడియో విడుదల చేసినట్లు యువతులు తెలిపారు. మాకు ఎవరూ లేరు.. నాన్న పట్టించుకోవడం లేదు.. అమ్మ కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వారు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని యువతులు వీడియోలో కోరారు. మాకు చివరి ఆశ పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే. ఆయన స్పందించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే మాకు ఇంకెక్కడికి వెళ్లాలో తెలియదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


